- మృతదేహంతో బంధువుల ఆందోళన
అచ్చంపేట, వెలుగు : వైద్యం వికటించి బాలింత మృతి చెందినట్లు ఆరోపిస్తూ మృతదేహంతో బంధువులు ఆందోళన నిర్వహించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బల్మూరు మండలం పొలిశెట్టిపల్లికి చెందిన పద్మ ఐదురోజుల కింద అచ్చంపేట పట్టణంలోని భవానీ ఆస్పత్రిలో ఆడబిడ్డను ప్రసవించింది. మంగళవారం డిశ్చార్జి సమయంలో బీపీ పెరగడంతో వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతరం ఆమె పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పద్మ మృతికి భవానీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతురాలి బంధువులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం మృతురాలి బంధువులు, గ్రామస్తులు, వివిధ కుల సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించగా, రాకపోకలు నిలిచిపోయాయి.
