న్యూఢిల్లీ: యూరోపియన్ బ్యాడ్మింటన్ టూర్‌లో ఇండియా షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. సంచలన ప్రదర్శనతో హైలో ఓపెన్ టైటిల్స్ నెగ్గారు. కానీ ఈ విజయాల వెనుక ఇండియా ప్లేయర్లు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు బయటకు రావడంతో ఒక్కసారిగా క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. యూరోపియన్ సిరీస్‌లోని నాలుగు టోర్నీలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి రావాల్సిన ఫండింగ్ ఆగిపోయింది.
దాంతో ప్లేయర్లు తమ సొంత డబ్బులతోనే టోర్నీలు ఆడేందుకు వెళ్లాల్సి వచ్చింది. గత నెల 6వ తేదీన ఫిన్లాండ్‌లోని ఆర్కిటిక్ ఓపెన్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు మాత్రమే ఫండింగ్ నిలిపేస్తున్నట్లు ప్లేయర్లకు సమాచారం అందించారని పీవీ సింధు వ్యాఖ్యానించింది. ‘ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యా. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదు. ఫండింగ్ లేదని ఆటను ఆపేయలేం. అందుకే వ్యక్తిగత ఖర్చులను నేనే భరించా. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కొంత సాయం అందించింది’ అని సింధు పేర్కొంది.
ఫండింగ్ లేకపోవడంతో కొన్ని టోర్నీలకు వ్యక్తిగత కోచ్‌లు లేకుండానే ప్రయాణించారు. ఆసియా గేమ్స్‌లో నిరాశపర్చడం వల్లే ఫండింగ్ ఆపేశారని ప్రచారం జరిగినా.. దీన్ని సాయ్ అధికారులు ఖండించారు. టోర్నీకి 30 రోజుల ముందు ప్రతిపాదనలు, ప్లేయర్ల జాబితాను బాయ్ పంపించాల్సి ఉంటుందన్నారు. కానీ బాయ్ సకాలంలో ఫైల్స్ పంపకపోవడంతో ఫండింగ్ నిలిచిపోయిందని స్పష్టం చేశారు. రాబోయే టోర్నీలకు ఫండింగ్ పునరుద్ధరించామని చెప్పినప్పటికీ.. ప్లేయర్లు ఖర్చు చేసిన వాటిని తిరిగి చెల్లించడం కుదరదని వెల్లడించారు.
ఐవోఏ అథ్లెట్స్ కమిషన్‌లో సింధు పీవీ సింధు.. ఇండియా ఒలింపిక్ అసోసియేసన్ (ఐవోఏ) అథ్లెట్స్ కమిషన్‌కు ఎంపికైంది. ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండానే 10 మంది ప్లేయర్లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2026–2030 కాలానికి గాను ఐదుగురు మెన్స్, ఐదుగురు విమెన్స్‌తో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
