- ఒక్కరోజు పర్మిషన్ ఇస్తే 17 రోజులు తిష్ట: ఎస్జీ తుషార్ మెహతా
- రెండు నెలల పాటు ఆంక్షలు పెట్టాలన్న వ్యాపారులు
- కేంద్రంతో పాటు సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ
న్యూఢిల్లీ: నిరసన పేరుతో ఏ ఒక్క గ్రూపూ ఒకే వేదికను నిరవధికంగా ఆక్రమించుకోలేదని, నిరసనల కోసం కేటాయించిన ప్రదేశాలకూ కాల పరిమితి ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జులైలో జరిగిన నిరసనలు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇటీవల ప్రతిపక్షాలు రాంలీలా మైదానంలో నిర్వహించిన ఆందోళనలతో వ్యాపారాలు దెబ్బతిన్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘ఎవరూ ఒకే ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించలేరు. ఇతర అంశాలపై నిరసనలు చేసేవారు కూడా ఉన్నారు. రైతులు, న్యాయవాదులు ఎక్కడికి వెళ్తారు? ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది’ అని సీజేఐ అన్నారు.
నిరసన ప్రదేశాలను నిర్దిష్ట కాలానికే కేటాయించాలని, అప్పుడే రైతులు, కార్మికులు, ట్రేడ్ యూనియన్లు సహా అందరూ నిరసన హక్కును వినియోగించుకోగలుగుతారని ధర్మాసనం పేర్కొంది.
ఒక్కరోజు పర్మిషన్.. 17 రోజులు తిష్ట
ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జులై 20న జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఒక్క రోజే అనుమతి ఇస్తే, నిరసనకారులు 17 రోజుల పాటు అక్కడే తిష్ట వేశారని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పార్లమెంట్ లేదా సుప్రీంకోర్టు వైపు మార్చ్ చేయడానికి అనుమతించలేమన్నారు. నిరసనలకు పిలుపునిచ్చినవారే ఆ తర్వాత జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
2 నెలలు ఆంక్షలు విధించండి: వ్యాపారులు
వ్యాపారుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నిరసనల వల్ల వ్యాపారులకు రూ.2 వేల కోట్ల ఆదాయ నష్టం వచ్చిందని తెలిపారు. నిరసన ప్రాంతం చుట్టుపక్కల దాదాపు 50 లక్షల మంది నివసిస్తున్నారని, ఆందోళనల వల్ల కన్నాట్ ప్లేస్ వంటి ప్రధాన ప్రాంతాల్లో షాపులన్నీ మూతపడి, జనం లేక వెలవెలబోయాయని చెప్పారు. పండుగ సీజన్లో వ్యాపారులు భారీగా నష్టపోయారని, రానున్న రెండు నెలలు నిరసనలపై ఆంక్షలు విధించాలని కోరారు. నిరసనలు నిర్వహించిన సంస్థలను కూడా ప్రతివాదులుగా చేర్చకుండా ఈ అంశాలపై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు, కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది. జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన కేంద్రం, దానికి బదులుగా రాంలీలా మైదానం, బురారీ గ్రౌండ్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌ను నిరసన వేదికలుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్ 15న సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది.
స్వాగతించిన వ్యాపారులు
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ స్వాగతించారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కుతో పాటు సామాన్య పౌరులు తమ జీవనోపాధిని కొనసాగించే హక్కును కాపాడటంలో కోర్టు సరైన రాజ్యాంగ సమతుల్యత పాటించిందని ఆయన అన్నారు.
