- మృతుడు గుజరాత్‌కు చెందిన గంధర్ నహీమ్ అజీజ్
న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో ఇండియన్ సెయిలర్(నావికుడు) ప్రాణాలు కోల్పోయాడు. నౌకలో ఉన్న మరో 13 మందిని ఒమన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించారు. నవంబర్ 2న ఎమ్ఎస్‌వీ అల్ జుసుఫీ నౌకపై ఈ వైమానిక దాడి జరిగినట్టు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. మృతుడిని గుజరాత్‌కు చెందిన గంధర్ నహీమ్ అజీజ్‌గా గుర్తించినట్టు చెప్పారు. హర్మూజ్ జలసంధి దాటిన తర్వాత ఒమన్ తీరంలో ఈ దాడి జరిగింది. 14 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ నౌకపై దాడి జరిగిన వెంటనే ఒమన్ కోస్ట్‌గార్డ్ రంగంలోకి దిగి 13 మందిని కాపాడింది. దాడిలో తీవ్రంగా గాయపడిన గంధర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన సిబ్బందిని, గంధర్ డెడ్‌బాడీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఒమన్ అధికారులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది.
దాడులపై కేంద్రం ఆందోళన
పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని స్పష్టం చేసింది. హర్మూజ్, ఒమన్ తీర ప్రాంతంలో ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరింది. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్యపరమైన రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని పేర్కొంది.
