- చెరువులు, కుంటల నుంచి ఆఫీసర్లు మట్టి తీయనియ్యట్లే
- ఓరుగల్లులో బంక మన్ను, ఎర్రమట్టి కోసం జిల్లాలు దాటివెళ్తున్రు
- కుమ్మరి ‘సారే’ యంత్రాలు కొనేందుకు శక్తి చాలట్లే
- పెట్టుబడి ఖర్చులు రాక రోడ్డున పడుతున్న కుమ్మరి వృత్తిదారులు
వరంగల్, వెలుగు : ప్రపంచానికి నాగరికత నేర్పిన కుమ్మరుల కుండ తయారీకి రాష్ట్రంలో ఊరురా మట్టి కష్టాలు మరింత పెరిగాయి. ఇంటింటికి గృహోపకర వస్తువులుగా వాడుకున్న కుండ, కూజా, ముంత, దీపాంతలు, కడవ, అటిక, లొట్టి, బింకె, రంజన్, గురిగి, చట్టి, పెంక వంటి వస్తువులు కనుమరుగయ్యాయి. కాగా, మారుతున్న జీవనశైలీ నేపథ్యంలో మట్టి పాత్రలకు మళ్లీ డిమాండ్ వస్తున్నా ముడిసరుకైన మట్టి ఇప్పుడు ఊరురా బంగారం కావడంతో కుమ్మర వృత్తిదారులకు ఏంచేయాలో పాలుపోవట్లేదు.
ఉచితంగా దొరికిన మట్టికి రూ.4 వేలు
వృత్తికి ప్రధానాధారం సహజసిద్ధ మట్టినే. నాటినుంచి నేటివరకు కులవృత్తికి అవసరమైన నల్ల బంక మట్టి (జిగడ మట్టి), ఎర్రమట్టి ఒకప్పుడు చెరువులు, కుంటల నుంచి ఉచితంగా ఎడ్లబండ్లతో తెచ్చుకునే వీలుండేది. కాగా, గ్రేటర్ వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాల చుట్టూరా ఉండే పల్లెలు ఇప్పుడు నగరంలో కలిసిపోయాయి.
రియల్ ఎస్టేట్ రాకతో చెరువులు, కుంటలు మాయమయ్యాయి. వీటితో పాటే కుమ్మర వృత్తిదారులకు మట్టి దూరమైంది. కులవృత్తినే నమ్ముకుని జీవించేవారికి మట్టి ఖర్చు బరువైంది. ఒకప్పుడు ఉచితంగా, నిన్నమొన్న వరకు రూ.1000 నుంచి రూ.1500 మధ్య ట్రాక్టర్ మట్టి లభించగా, ఇప్పుడు ఏకంగా రూ.4 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. మట్టి కోసం వరంగల్ నగరం నుంచి ములుగు జిల్లా మల్లంపల్లికి వెళుతున్నారు.
తాహతుకు మించి ‘విద్యుత్ యంత్రాల రేట్లు’
చెరువు ఒడ్డున ఉండే మట్టి మనుషులకు పనకొచ్చే కుండగా తయారుచేసే క్రమంలో దాదాపు పది రకాల పద్ధతుల్లో పనిచేయాల్సి ఉంటుంది. మట్టి తీసుకురావడం, దానిని ముక్కలుగా విడగొట్టడం, జల్లెడ పట్టడం, మట్టిని నీటిలో రోజులపాటు నానబెట్టడం, కాళ్లతో గంటల తరబడి తొక్కిన తర్వాత కుమ్మర చక్రం(సారే) మీదకు చేరుతుంది.
ఆపై వృత్తిదారుడి చేతిలో ప్రాణం పోసుకునే కుండ ఆరబెట్టడం, రంగులు అద్దడం, చివరగా వాము (అవ్వం, పొయ్యి)లో దానిని కాల్చితే మట్టికి రూపం వస్తుంది. అందుకే ఆ రోజుల్లో ఇంటిపెద్ద మొదలు, కుటుంబంలోని మహిళలు, యువకులు, పిల్లలంతా ఇదే వృత్తిలో ఉన్నారు. కొన్నేండ్లుగా వృత్తికి ఆధారణలేకపోవడంతో కుమ్మరులు ఇతర కూలీలుగా మారారు.
దీంతో మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిదారులు విద్యుత్ యంత్రాలను వినియోగించాల్సి వస్తుంది. వృత్తికి ప్రధానమైన పగ్ మిల్ (మట్టి పిసికే యంత్రం), ఎలక్ట్రిక్ పొటరీ వీల్ (కుమ్మరి చక్రం), సెమీ ఆటోమెటిక్ పోటరీ ప్రెస్ (వేగంగా తయారు చేసే మిషిన్), ఎలక్ర్టిక్ బట్టీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ యంత్రాలను గతంలో ప్రభుత్వాలు కుమ్మరులకు ఉచితంగా అందించగా, ప్రస్తుతం ఆ తరహా ప్రొత్సాహం లేకపోవడంతో వృత్తిదారులకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేయడం తాహతుకు మించిన భారమైంది
డిమాండున్నా..పెట్టుబడి ఖర్చులు రావట్లే
కాలచక్రం తిరిగినట్లుగా మనిషి జీవనశైలీ కొన్ని రోజులుగా మళ్లీ మట్టి పాత్రల వైపే మళ్లుతోంది. వంట పాత్రలు మొదలు గృహోపరణల వరకు మట్టితో తయారు చేసినవే వాడేందుకు ఇష్టపడుతున్నారు. ప్లాస్టిక్, అల్యూమీనియం, స్టీల్ వంటి పాత్రల వాడకంతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ప్రాణాంతకర క్యాన్సర్ వ్యాధులబారిన పడుతున్నారు.
తిరిగి డాక్టర్లు, పర్యావరణవేత్తల సూచన మేరకు మళ్లీ పాత రోజులకే మళ్లుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తిరిగి మట్టి పాత్రల్లోనే కూరలు, బిర్యానీ, పెరుగు తయారు చేయడం మొదలు మంచినీటికి సైతం కుండలు, రంజన్లు, కూజ వాడేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ క్రమంలో కుమ్మర వృత్తికి మళ్లీ డిమాండ్ పెరుగుతున్నా వేలాది రూపాయల మట్టి ఖర్చులు, మట్టి పాత్రలను కాల్చే క్రమంలో వాము (అవ్వం)లో వాడే కట్టెలు, చెక్కపొట్టు ఖర్చులు తడిసిమోపైతున్నాయి. వృత్తిదారులు ఇంతకష్టపడ్డాక.. మట్టి కుండలు, పాత్రలకు సరైన ధరలు రాక ఇబ్బందిపడాల్సి వస్తుంది.
కరెంట్ యంత్రాలు ఇవ్వలే..
ఒకప్పుడు ఇంట్లో పదిమంది ఉంటే అందరం మట్టి పనినే నమ్ముకుని పనిచేసేటోళ్లం. మట్టి పాత్రలకు డిమాండ్ లేక ఇప్పుడు అందరూ కూలి పనిచేసుకుంటున్నరు. ఉన్నోళ్లకు వయసుమీద పడ్డది. మట్టి జల్లెడ పట్టుడు, పచ్చిమట్టి తొక్కుడు, సారే తిప్పే పనులను కరెంట్ యంత్రాలే చేస్తున్నయ్. సర్కారు వాటిని ఉచితంగా అందించి కుమ్మర కులవృత్తిని ఆదుకోవాలే.
-పైడిపాల శ్రీనివాస్ (కుమ్మర సంఘం నేత)-
చెరువుల మట్టిని ఉచితంగా ఇయ్యాలే
వందల ఏండ్లుగా మట్టినే నమ్ముకుని చేసుకునే కులవృత్తి మాది. కానీ ఇప్పుడు అదే మట్టి మాకు బంగారమవుతోంది. చెరువులు, కుంటలు అందుబాటులో లేవు. దూరప్రయాణం చేసి చెరువుల వద్దకెళ్లినా ఆఫీసర్లు మట్టిని తీసుకుపోయివ్వట్లేదు. మట్టిని కొందామంటే ట్రాక్టర్కు రూ.4వేలు అడుగుతున్రు. దీంతో మట్టిపని మాతో కావట్లే. ప్రభుత్వపెద్దలు కుమ్మర వృత్తిని కాపాడాలంటే మట్టిని ఉచితంగా అందించాలే.
– కందికొండ సదానందం (వృత్తిదారుడు)-
