హైదరాబాద్, వెలుగు: మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని, పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు తప్పవని వామపక్ష నేతలు హెచ్చరించారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టమైన నేపథ్యంలో, దానిని కేవలం ఆదాయ వనరుగా చూస్తూ అమ్మకానికి పెట్టాలని చూడటం దారుణమని మండిపడ్డారు.
ఈ మేరకు మంగళవారం ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం మియాపూర్లోని వివాదాస్పద భూములతో పాటు స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీలను సందర్శించి స్థానికులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాడి కాపాడుకున్న ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.
తరతరాలుగా అక్కడే ఇండ్లు కట్టుకుని జీవిస్తున్న పేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇచ్చి చట్టబద్ధత కల్పించాలని, మిగిలిన భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఆదాయం పేరిట పేదల గూడును లాక్కోవాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
