- మళ్లీ ఫారం-6 వేసినా తప్పుడు డిక్లరేషన్ కాదు
- సెక్షన్ 31 కింద కేసులు పెట్టొద్దని ఈఆర్వోలకు ఆదేశం
- మరో నియోజకవర్గంలో ఓటు ఉండకూడదని షరతు
- ఢిల్లీ హైకోర్టు తీర్పుతో అన్ని రాష్ట్రాల సీఈవోలకు గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ప్రచురించిన ముసాయిదా జాబితాలో పేర్లు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఊరట కల్పించింది. అలాంటి వారు తిరిగి ఓటు నమోదు కోసం నిరభ్యంతరంగా ఫారం–6 సమర్పించవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఓటు ఉండి మళ్లీ ఫారం–6 వేసినంత మాత్రాన అది తప్పుడు డిక్లరేషన్ కిందకు రాదని తేల్చిచెప్పింది.
ఇలా ఫారం–6 సమర్పించిన పాత ఓటర్లపై ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల (ఈఆర్వో)ను ఆదేశించింది. అయితే, ఆ ఓటరుకు మరో నియోజకవర్గంలో ఓటు ఉండకూడదని షరతు విధించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈవో)కు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘మొదటిసారి’ డిక్లరేషన్‌పై భయం
ఫారం–6లో ‘ఓటరు జాబితాలో నా పేరు మొదటిసారి నమోదు చేసుకుంటున్నాను’అనే డిక్లరేషన్ ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే సెక్షన్ 31 కింద శిక్షార్హమని అదే ఫారంలో హెచ్చరిక కూడా ఉంటుంది. దీంతో గతంలో ఓటు ఉన్నవారు ఈ డిక్లరేషన్‌పై సంతకం చేస్తే కేసుల్లో ఇరుక్కుంటామేమోనని భయపడి ఫారం–6 వేసేందుకు వెనుకాడుతున్నట్లు ఈసీ దృష్టికి వచ్చింది. ఈ డిక్లరేషన్ 2022 ఆగస్టు 1 నుంచి అమల్లో ఉందని గుర్తుచేసిన ఈసీ, ఇలాంటి పరిస్థితుల్లో ఫారం–6 సమర్పించడం కేవలం జాబితాలో పేరు చేర్చుకోవడం కోసమేనని, గతంలో ఓటు ఉన్నంత మాత్రాన అది తప్పుడు డిక్లరేషన్ కాదని స్పష్టం చేసింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుతో..
నిలోత్పల్ దత్తా వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో అక్టోబర్ 14న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈసీ ఈ స్పష్టత ఇచ్చింది. ఢిల్లీ సర్‌లో జాబితా నుంచి పేర్లు తొలగించిన ఇద్దరు ఓటర్లు, తాము కొత్త ఓటర్లం కాదు కాబట్టి ఫారం–6 వేస్తే తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లవుతుందని కోర్టును ఆశ్రయించారు. వారు ఫారం–6 వేయొచ్చని, ఈ భయం అనవసరమని హైకోర్టు పేర్కొంది. ఇప్పటికే జాబితాలో పేరున్నవారిని కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం–6 ద్వారా దరఖాస్తు చేయమని ఎందుకు అడుగుతున్నారని సుప్రీంకోర్టు కూడా అక్టోబర్ 28న ప్రశ్నించింది.
స్థానిక భాషల్లో ప్రచారం
ఈ స్పష్టతను స్థానిక భాషల్లో ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఈసీ అన్ని రాష్ట్రాల సీఈవోలను ఆదేశించింది. ముసాయిదా జాబితాలో పేర్లు గల్లంతైన అర్హులైన ఓటర్లు ఎలాంటి న్యాయపరమైన భయం లేకుండా తిరిగి దరఖాస్తు చేసుకునేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈసీ తెలిపింది.
