- విద్యాసంస్థలకు ముందస్తుగా దీపావళి హాలిడేస్
హైదరాబాద్, గచ్చిబౌలి, వెలుగు: రెండో రోజు వాటర్ ట్యాంకర్ల సమ్మెతో హైదరాబాద్‌లో కాలేజీ, హాస్టల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఐటీ కారిడార్హాస్టల్స్ అసొసియేషన్ నిర్వాహకులు బుధవారం శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్ఆర్ నగర్ హాస్టల్స్ లో నీటి ట్యాంకర్ల కోసం ఇబ్డందులు పడుతున్నామని వాటర్ బోర్డు ట్యాంకర్లు సప్లై పెంచాలని జలమండలి జీఎంకు వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు వాటర్‌ట్యాంకర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు బుధవారం సాయంత్రం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో సమావేశమయ్యారు. ట్యాంకర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు, నీటి సరఫరాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత ప్యూర్(పెరి అర్బన్ రీజియన్) ప్రాంతాల నుంచి బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు యజమానులు అంగీకరించారు. ఇకపై తమ వ్యాపార కార్యకలాపాలను ఓఆర్ఆర్ అవతల ప్యూర్ ప్రాంతాల నుంచే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ట్యాంకర్ల సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇండ్లలో బోర్లు ఎండిపోతున్నయ్: రంగనాథ్
నగరంలో జనసాంద్రత పెరగడం, ఎల్‌నినో ప్రభావం, తగిన వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని కమిషనర్ రంగనాథ్ ట్యాంకర్ల యజమానులకు వివరించారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అశోక్‌నగర్‌వంటి ప్రాంతాల్లో నీటి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ట్యాంకర్ల నిర్వాహకులు రవాణా, ఇంధన ఖర్చులు తగ్గించుకునేందుకు నగరానికి సమీపంలోని బోర్ల నుంచి నీటిని తోడుతున్నారని తెలిపారు. ఇండ్ల అవసరాల కోసం 100 నుంచి 300 అడుగుల లోతులో బోర్లు వేస్తుండగా, వాణిజ్య అవసరాల కోసం కొందరు 1,000 నుంచి 1,500 అడుగులు, అంతకంటే ఎక్కువ లోతులో బోర్లు వేసి అధిక సామర్థ్యం కలిగిన మోటార్లతో నీటిని తోడుతున్నారని చెప్పారు.
దీంతో స్థానిక నివాసితుల ఇంటి అవసరాలకు ఉపయోగించే బోర్లలో నీరు అడుగంటిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. తెల్లాపూర్‌లో వాణిజ్య అవసరాల కోసం నీటిని తోడటాన్ని నిలిపివేయాలని స్థానికులు నిరసన తెలిపారని చెప్పారు. సూరారం, జీడిమెట్ల ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలోని బోర్లలో నీరు తగ్గిపోతోందని హైడ్రా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ అధికారుల సమన్వయంతో హైడ్రా చర్యలు చేపట్టిందన్నారు.
