మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌లో శ్రీకర్ నయన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. నవంబర్ 6న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘మూవీ కంటెంట్ చూస్తున్నంత సేపు మనకు తెలియని ఎమోషన్స్ కనెక్ట్ చేస్తున్నారు అనిపించింది.
మనం మర్చిపోయిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంది. ఈ చిత్రం ద్వారా మనల్ని , మన అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తారని నమ్ముతున్నా. చిన్నారుల ఎనర్జీ చూస్తుంటే సినిమాలో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారనిపిస్తోంది. ప్రేక్షకులంతా చిన్న పిల్లలైపోయి సినిమాను ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు. మంచి నోల్టాల్జిక్ ఫిలిం అవుతుందంటూ అల్లు అరవింద్ బెస్ట్ విషెస్ చెప్పారు. వినోదంతో పాటు సందేశం కూడా ఇచ్చే ఈ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ బాబీ అభినందనలు తెలియజేశారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘పిల్లలు నటించిన పెద్దల చిత్రమిది. పెద్దలకు బాగా కనెక్ట్ అవుతుంది. కుటుంబం అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అని చెప్పారు. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, డైరెక్టర్ శ్రీకర్ నయన్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, కొరియోగ్రాఫర్ సందీప్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
