ములుగు/వర్గల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ లో ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం... మర్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన ఆరే మల్లేశం కుమారుడు రామ్ చరణ్ (15) వర్గల్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ లో ఉంటూ పదవ తరగతి చదువుకుంటున్నాడు.
కాగా, బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి రామ్ చరణ్ ను టీచర్ మందలించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన రామ్ చరణ్ హాస్టల్ కు చేరుకొని స్లాబ్ కొక్కానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం హాస్టల్ సిబ్బంది గమనించి వార్డెన్ నర్సింలుకు సమాచారం అందించారు.
ఈ మేరకు వార్డెన్ గౌరారం పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని రామ్ చరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోపం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, గజ్వేల్ చేరుకున్న విద్యార్థి రామ్ చరణ్ తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఆయా విద్యార్థి సంఘ నేతలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు గజ్వేల్ తో ఆస్పత్రి వద్ద, వర్గల్ బీసీ హాస్టల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
