సిద్దిపేట రూరల్, వెలుగు: ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తిని రూ.16.32 లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో చెన్నైకి చెందిన ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. సీపీ వివరాల ప్రకారం.. బాధితుడిని గుర్తుతెలియని వ్యక్తులు ‘జడ్4 హై ప్రాఫిట్ స్టాక్ స్టడీ’ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. తాము ప్రముఖ పెట్టుబడి సంస్థ ప్రతినిధులమని, తమ గ్రూపు సెబీ, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పనిచేస్తోందని నమ్మించారు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించారు. నకిలీ వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేయించి, తొలుత చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టించారు. వెబ్‌సైట్లలో అధిక లాభాలు వచ్చినట్లు నకిలీ వివరాలు చూపించి నమ్మించారు. దీంతో బాధితుడు ఏడు విడతల్లో మొత్తం రూ.16,32,000 పెట్టుబడిగా బదిలీ చేశాడు. మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేయడంతో మోసాన్ని గుర్తించి వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశాడు.
కేసు దర్యాప్తులో బ్యాంకు ఖాతాల ఆధారంగా చెన్నైకి చెందిన ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మోసంలో ఇతర నిందితుల ప్రమేయం, బ్యాంకు లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ పి.రాజు, ఆఫీసర్లు, సిబ్బందిని సీపీ అభినందించారు.
