హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టి, వ్యవస్థను ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. ఈ మేరకు బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిస్కంలకు వేల కోట్ల అప్పులు మిగిల్చి, ఇప్పుడు ఈఆర్సీ ముందు బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టడం బీఆర్ఎస్ విధానమైతే.. నిజాలను నిర్భయంగా చెప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గును పక్కనపెట్టి, విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునేందుకు కుట్రలు చేసిందని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశీయ బొగ్గునే వినియోగంలోకి తెచ్చేందుకు నైనీ బ్లాక్ నుంచి బొగ్గును అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. విద్యుత్ అంశంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలను అబద్ధాలతో తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు
