వేములవాడ రూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోనెల పర్శరాములు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నాడు. గార్డెనింగ్ పని కోసమని రష్యాకు వెళ్లిన అతడిని అక్కడి ఆర్మీలోకి చేర్చుకుని ఉక్రెయిన్ తో యుద్ధం చేయిస్తున్నారని తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
బాధితుడి భార్య శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ కు చెందిన ఓ ఏజెంట్ కు రూ.2.5 లక్షలు ఇచ్చి ఈ ఏడాది జనవరిలో ఉపాధి కోసమని పర్శరాములు రష్యా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కొద్దినెలల పాటు కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడేవాడు. అయితే జూలై 31 నుంచి అతడి ఫోన్ పని చేయడం లేదని శిరీష తెలిపారు.
ఈ క్రమంలోనే తనను రష్యా ఆర్మీలోకి మోసపూరితంగా, బలవంతంగా తీసుకెళ్లినట్లు నాలుగు నెలల కింద మరొకరి ఫోన్ నంబర్ ద్వారా తమకు యూనిఫామ్ లో ఉన్న ఫొటోలను పంపాడని వెల్లడించారు. మళ్లీ ఆ ఫోన్ కలవడం లేదన్నారు. దీంతో అతడు క్షేమంగా ఉన్నాడో లేడో తెలియక శిరీష, వారి ఇద్దరు పిల్లలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి భారత విదేశాంగ శాఖ ద్వారా పర్శరాములు ఆచూకీ కనుగొని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
