ఆదివాసీ గూడాల్లో ‘దండారి’ సంబరాలు.. ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనుల సందడి

ఆదివాసీ గూడాల్లో ‘దండారి’ సంబరాలు.. ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనుల సందడి

జైనూర్ /తిర్యాణి, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ఆదివాసీ గూడాల్లో దండారి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు రోజుల కింద బోగి పండుగతో ప్రారంభమైన ఉత్సవాలు గ్రామగ్రామాన ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 

బుధవారం జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, తిర్యాణి మండలాల్లోని పలు గ్రామాల్లో బోగి పండుగ నిర్వహించి దండారి వేడుకలకు శ్రీకారం చుట్టారు. జైనూర్ మండలం డబ్బోలి, తిర్యాణి మండలంలోని ఇర్కపల్లి గ్రామస్తులు మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని పద్మల్ పూరి కాకో దేవస్థానానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మరో వారం రోజుల పాటు ఏజెన్సీ గ్రామాల్లో దండారి ఉత్సవాలు కొనసాగనున్నాయి.

 ఈ సందర్భంగా ఒక గ్రామానికి చెందిన దండారి బృందం మరో గ్రామానికి వెళ్లి గుస్సాడి, చాచోయి నృత్యాలతో సందడి చేస్తుంది. మహిళలు రేలా రేలా పాటలతో అతిథులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతారు. 

ఇలా పరస్పరం ఆతిథ్య మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం. దండారి కేవలం ఓ పండుగ మాత్రమే కాదని, అది ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పద్మశ్రీ కనకరాజు గుస్సాడి కళాకారుల బృందం ప్రతినిధి కనక సుదర్శన్ అన్నారు.