అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం: జేడీ వాన్స్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం: జేడీ వాన్స్

వాషింగ్టన్: మిడ్‌‌‌‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్‌‌‌‌తో యుద్ధమే ప్రధాన కారణమని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పేర్కొన్నారు. నవంబర్ 4న ఎక్స్​లో సుదీర్ఘ పోస్ట్ చేసిన వాన్స్.. 2024లో ట్రంప్- వాన్స్ టీమ్​కు ఓటేసిన అనేకమంది ఈసారి డెమొక్రాట్లకు మద్దతిచ్చారని చెప్పారు. ‘‘మా వోటర్లు బయటకొచ్చారు. కానీ అసలు సమస్య టర్నవుట్ కాదు. 2024లో ట్రంప్–వాన్స్ కు ఓటేసిన చాలామంది 2026లో డెమొక్రాట్లకు ఓట్లు వేశారు’’ అని వాన్స్  పేర్కొన్నారు. 

పలు రాష్ట్రాల్లో టర్నౌట్ మొదట్లో ఆశాజనకంగా కనిపించిందని, కొన్నిచోట్ల ‘చాలా బాగుంది’ అని రిపబ్లికన్ డేటా అనలిస్టులు చెప్పారని వాన్స్ తెలిపారు. అయితే తాను సంప్రదించిన ఒక పోలింగ్ నిపుణుడు, 2024లో ట్రంప్‌‌‌‌కు ఓటేసిన చాలామంది ఆగ్రహంగా ఉన్నారని, డెమొక్రాట్లకు ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారని ముందే హెచ్చరించారని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ కోల్పోయిన మద్దతుదారులను, ఓటర్లను తిరిగి రప్పించడానికి ఏం చేయాలని అడిగినప్పుడు వారు తనకు నాలుగు ప్రధాన అంశాలు చెప్పారని వాన్స్ వివరించారు. 

యుద్ధం ఆపడం, జీవన వ్యయం-ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టడం, అమెరికా ముందు అనే సూత్రాన్ని పాటించడం, ఇజ్రాయెల్‌‌‌‌తో అమెరికా సంబంధాల్లో మార్పు తీసుకురావాలని చెప్పారన్నారు. ‘మనం ఓడిపోవడానికి కారణం యుద్ధమే. ప్రెసిడెంట్ నిన్న రాత్రే ఆ విషయం చెప్పారు’ అని వాన్స్ రాశారు. పార్టీ భవిష్యత్తుపై జరిగే ఏ చర్చ అయినా ఈ సంఘర్షణతో మొదలవ్వాలని ఆయన స్పష్టం చేశారు. యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం వెతకాలన్న పిలుపుతో రిపబ్లికన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కన్జర్వేటివ్ కామెంటేటర్ రాచెల్ కాంపోస్ డఫీ ని వాన్స్ సమర్థించారు. ఆమె ఇచ్చిన సలహా రాజకీయంగా సరైనదిగా నిరూపితమైందని పేర్కొన్నారు. సెనేట్‌‌‌‌పై నియంత్రణ కోల్పోవడం గురించి వాన్స్  ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాబోయే 6 సంవత్సరాలు సెనేట్ చేజారడం దీనికి తగిన మూల్యమని భావిస్తే, అదే వాదన బహిరంగంగా చేయండి’ అని హెచ్చరించారు. ఓటమికి ఇమిగ్రేషన్ కారణమని చెప్పేవారిని వాన్స్ నిరాకరించారు.