- డెమొక్రాట్లు తనతో కలిసి పనిచేస్తారని ఆశాభావం
వాషింగ్టన్: మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. బ్యాలెట్ పేపర్‌పై తన పేరు లేకపోవడమే రిపబ్లికన్ల ఓటమికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తన పేరే కనుక బ్యాలెట్‌లో ఉంటే రిపబ్లికన్లు భారీ మెజార్టీతో గెలిచేవారని జోస్యం చెప్పారు. ఈ మేరకు బుధవారం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. “ బ్యాలెట్‌లో నా పేరు లేదు. ఒక వేళ ఉంటే మాత్రం రిపబ్లికన్లు భారీ మెజార్టీతో విజయం సాధించేవారు’’ అని తెలిపారు.
అంతకు ముందు రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన అనేక ర్యాలీలలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను స్వయంగా పోటీలో ఉన్నానని భావించి ఓటేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అనంతరం షేర్ చేసిన మరో పోస్ట్‌లో, తాను ఒక రాజకీయ విశ్లేషకుడిగా మారి, రిపబ్లికన్ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో కారణాలు చెప్పబోతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. “రిపబ్లికన్ అభ్యర్థులు గెలవడానికి, ఓడిపోవడానికి ఉన్న మంచి, చెడు కారణాలను చెప్పే ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను మారబోతున్నాను” అని వెల్లడించారు.
డెమొక్రాట్లకు అభినందనలు
డెమొక్రాట్లు భారీ విజయం సాధించడంతో వారికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారికి శుభాకాంక్షలు చెప్పారు. అద్భుతంగా పోరాడి గెలుచినందుకు వారికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘డెమొక్రాట్లకు నా శుభాకాంక్షలు. దేశ సంక్షేమం కోసం వారితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని వివరించారు. ఎన్నికల ఫలితాలను తాను కచ్చితంగా ఆమోదిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీటో పవర్ చూపిస్తానన్న ప్రెసిడెంట్
డెమొక్రాట్లు తనతో కలిసి పనిచేస్తారనే నమ్మకం ఉందని, ఒకవేళ వారు సహకరించకపోతే తమ వద్ద ఉన్న వీటో అధికారాన్ని ఉపయోగిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ‘‘నాకు వీటో అధికారం ఉందనే విషయం వారికి తెలుసు. ప్రతి బిల్లును నేను వీటో చేస్తూ పోతే వారు తట్టుకోలేరు. అందుకే వారే నా వద్దకు వచ్చి కలిసి పనిచేస్తారని భావిస్తున్నాను’’ అని తెలిపారు. అంతేకాకుండా వీటో అని రాసి ఉన్న రెడ్ కలర్ మాగా క్యాప్ ఫొటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ స్వయంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన టెక్సాస్, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, ఓహియో వంటి కీలక స్థానాల్లో కూడా రిపబ్లికన్లు ఓటమి పాలయ్యారు. దీనిపై స్పందిస్తూ.. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నచ్చకపోవడమే ఓటమికి కారణమని వెల్లడించారు.
