హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీలు, గుర్తింపు పొందిన డాక్టర్లు దాఖలు చేసే అప్పీళ్ల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఈ-మెయిల్, పోస్టు లేదా నేరుగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. పోర్టల్ ద్వారా వచ్చిన అప్పీళ్లను మాత్రమే పరిశీలిస్తామని ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ వెల్లడించారు. ఈ మేరకు సమగ్ర మార్గదర్శకాలతో పబ్లిక్ నోటీస్ జారీ చేశారు.
తాజా నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీలు మార్బ్, యూజీఎంఈబీ, పీజీఎంఈబీ బోర్డుల నిర్ణయాలపై అప్పీల్ చేసుకోవాలంటే https://application.nmc.org.in/login వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. ఇందుకు రూ.50 వేల ఫీజుతో పాటు 18 శాతం జీఎస్టీ కలిపి మొత్తం రూ.59 వేలు చెల్లించాలి. మరోవైపు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు కూడా ఆన్లైన్లోనే అప్పీళ్లు దాఖలు చేయాలి. స్టేట్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయంపై మొదటి అప్పీల్‌ను ఈఎంఆర్‌బీ ఎదుట, ఈఎంఆర్‌బీ నిర్ణయంపై రెండో అప్పీల్‌ను ఎన్ఎంసీ ఎదుట చేసుకోవచ్చు. ఇందుకు నిర్ణయం వెలువడిన 60 రోజుల్లోగా https://application.nmc.org.in/appeal పోర్టల్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసి దరఖాస్తు చేయాలి.
