నీళ్ల పైపులకు అన్నీ తూట్లే..గ్రేటర్ వరంగల్ లో లీకవుతున్న ప్రధాన వాటర్‍ పైప్‍ లైన్లు

నీళ్ల పైపులకు అన్నీ తూట్లే..గ్రేటర్ వరంగల్ లో లీకవుతున్న ప్రధాన వాటర్‍ పైప్‍ లైన్లు
  • నీటి సరఫరా కోసం ఖర్చు చేసింది రూ.650 కోట్లు
  • ట్రైసిటీ మెయిన్‍రోడ్ల వెంట డ్రైనేజీలో కలుస్తున్న తాగునీళ్లు
  • జీడబ్ల్యూఎంసీ పరిధిలో నిత్యం వృథా అవుతున్న లక్షల లీటర్లు 
  • ఈ నెల 1 నుంచి నీటివృథాకు రూ.5 వేల జరిమానా అమలు
  • జనాలకు నీటి పొదుపు చెప్పి చోద్యం చూస్తున్న ఆఫీసర్లు 

వరంగల్‍/ కాశీబుగ్గ, వెలుగు: ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి పొంచి ఉందనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నీటి సంరక్షణపై దృష్టి పెట్టింది. నీటిని వృథా చేయకుండా జాగ్రత్త చర్యలు చేపడుతోంది. కానీ, గ్రేటర్​ వరంగల్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. 

ట్రైసిటీలో నిత్యం వందలాది చోట్ల వాటర్​సప్లై మెయిన్​పైపులు లీకేజీ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల తాగునీరు లీకై వేలాది లీటర్లు డ్రైనేజీలో కలుస్తోంది. ఎల్​నినో చర్యల పేరుతో నీటి వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు పైప్​లైన్​ లీకేజీలను అరికట్టలేకపోతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నారు. 

2.54 లక్షల ఇండ్లు.. 11 లక్షల జనాభా..

గ్రేటర్ వరంగల్‍ ఏరియా 407.71 స్వ్కేర్‍ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. వరంగల్‍, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో 66 డివిజన్లు, విలీన గ్రామాలున్నాయి. రెండేళ్ల కింద గ్రేటర్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ లెక్కల ప్రకారం నగరంలో 2 లక్షల 54 వేల 354 నివాసాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 11 లక్షల జనాభా నివసిస్తున్నారు. వీరికితోడు వివిధ పనులపై నిత్యం సిటీకి మరో 10 లక్షల మంది వచ్చిపోతుంటారు. దీంతో పట్టణానికి భారీ స్థాయిలో తాగునీరు అవసరమవుతోంది. 

2.4 లక్షల నల్లా కనెక్షన్లు.. 

గ్రేటర్‍ పరిధిలో  రోజుకు 180.95 ఎంఎల్‍డీల నీటి సరఫరా అవసరం కాగా, మొత్తం ఇన్​స్టాలేషన్​ కెపాసిటీ 231.28 ఎంఎల్‍డీలుగా ఉంది. వడ్డెపల్లి ఫిల్టర్‍ బెడ్‍ ద్వారా 49.46 ఎంఎల్డీలు, కేయూసీ ఫిల్టర్‍ బెడ్‍ ద్వారా 43.64 ఎంఎల్‍డీలు, దేశాయిపేట ఫిల్టర్‍ బెడ్‍ ద్వారా 78.10 ఎంఎల్‍డీల నీటిని సరఫరా చేసే సామర్థ్యం ఉంది. 

మిషన్‍ భగీరథ ధర్మసాగర్ వాటర్‍ సప్లై ద్వారా మరో 60 ఎంఎల్‍డీల కెపాసిటీ అందుబాటులో ఉంది. సిటీ మొత్తం 3390.11 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్‍ పైప్‍లైన్‍ నెట్‍వర్క్​ఉంది. 125 వాటర్‍ ట్యాంకులున్నాయి. తాగునీటి వ్యవస్థను బలోపేతం పేరుతో గతంలోనే సుమారు రూ.650 కోట్ల వరకు నిధులు ఉపయోగించారు. మిషన్ భగీరథ, అమృత్‍ స్కీం కింద 2.4 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు.

నీరు వృథా చేస్తే రూ.5 వేల ఫైన్‍.. 

ఎల్‍నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి వృథాను అరికట్టడానికి జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నీటి సంరక్షణపై కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్లను పైపులతో కడగకుండా బకెట్​నీటితో శుభ్రం చేసుకోవాలని, విందులు, వినోదాలకు తక్కువ నీరు ఉపయోగించాలని సూచిస్తున్నారు. నీటి వృథాను గుర్తించేందుకు ఎన్‍ఫోర్స్​మెంట్‍ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నవంబర్‍ 1 నుంచి నీటివృథా చేసేవారికి రూ.5 వేల జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
 

డైలీ 30 ఎంఎల్‍డీల నీటి వృథా..


ఇన్ని రోజులూ గ్రేటర్‍ జనాలకు ఎస్సారెస్పీ ద్వారా తాగునీరు అందగా, ఇప్పుడు ఎల్‍నినో ప్రభావంతో కాకతీయ కెనాల్‍ ఎండిపోవడంతో దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీరు పంపింగ్‍ చేసి సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నీటిని కాపాడుకోవాలని జనాలకు చెబుతున్న గ్రేటర్‍ మున్సిపల్‍ ఆఫీసర్లు కళ్లముందు నిత్యం వేలాది లీటర్ల నీరువృథా అవుతున్నా అరికట్టలేకపోతున్నారనే విమర్శలు పెరిగాయి.

సిటీలో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లవెంట తవ్వి వదిలేయడం, పైపులైన్ల నిర్వహణలో లోపాలు తాగునీటి వృథాకు కారణమవుతున్నాయి. నిత్యం కనీసం పది, పదిహేను ప్రాంతాల్లో మెయిన్‍ వాటర్‍ సప్లై పైపులు లీకేజీ అవుతున్నాయి. 

గంటల వ్యవధిలోనే లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది. వరంగల్‍, హనుమకొండ, కాజీపేటలో ప్రధాన రోడ్లవెంట తాగునీరు డ్రైనేజీల్లో కలుస్తున్నాయి. రోజూ సుమారు 30 ఎంఎల్‍డీల తాగునీరు వృథా అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆఫీసర్లు జరిమానాలు విధించడంపై చూపుతున్న శ్రద్ధ పైపులైన్​ లీకేజీల నివారణపై చూపిస్తే తాగునీటిని కాపాడవచ్చని సిటీ జనం అభిప్రాయపడుతున్నారు. ముందుగా లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.