మీర్ పేట్ లో డబుల్ మర్డర్.. భార్య, పిల్లలు, అత్తమామల కుటుంబంపై కత్తితో దాడి

మీర్ పేట్ లో డబుల్ మర్డర్.. భార్య, పిల్లలు, అత్తమామల కుటుంబంపై కత్తితో దాడి
  • అత్త, బావమరిది భార్య కన్నుమూత 
  •     బావమరిది, భార్య, కూతురికి సీరియస్​ 

మీర్​పేట్​ వెలుగు: భార్యతో గొడవతో ఓ భర్త తన భార్య, కూతురు, అత్త, బావమరిదిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త , భార్య కన్నుమూయగా బావమరిది, భార్య, కూతురు ప్రాణాలతో పోరాడుతున్నాడు. హైదరాబాద్​పరిధిలోని మీర్​పేట్​పోలీసుల కథనం ప్రకారం..షరీఫ్ నగర్‌‌‌‌కు చెందిన షేక్ మహమ్మద్ సిద్ధిఖీ, అతడి భార్య నూర్ బేగం మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తన భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె గొడవ పడుతోంది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో భర్త ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అతడు ఏమైనా చేస్తాడేమోననే అనుమానంతో బుధవారం మధ్యాహ్నం మీర్​పేట్​పీఎస్​కు తన కూతురితో కలిసి వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేసింది. 

అక్కడి నుంచి మీర్‌‌‌‌పేట్‌‌‌‌లోని సాయి విహార్ కాలనీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సిద్ధిఖీ సాయంత్రం 4 గంటల వేళ అత్తింటికి చేరుకొన్నాడు. అక్కడ ఈ  విషయమై అత్త షేక్ నిరంజన్ బీ (50), బావమరిది యూసుఫ్, అతడి భార్య రేష్మ (38), తన భార్య నూర్​బేగంతో గొడవకు దిగాడు. మాట మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన మహమ్మద్ సిద్ధిఖి వెంట తెచ్చుకున్న కత్తితో బావమరిది భార్య రేష్మాబేగంపై అటాక్​చేశాడు. తర్వాత అత్త షేక్ నిరంజన్ బీ, బావమరిది యూసుఫ్ లపై కూడా దాడికి తెగబడ్డాడు. అడ్డువచ్చిన భార్య, కూతురిని కూడా వదల్లేదు. ఆమె రక్తమోడుతూ మొదటి అంతస్థుకు పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిరంజన్ బీ, రేష్మ చనిపోగా, యూసుఫ్, అతడి భార్య నూర్​బేగం, కూతురు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేసిన అనంతరం మహ్మద్ సిద్దిఖి అక్కడి నుంచి పరారయ్యాడు. శంషాబాద్ డీసీపీ రాజేశ్, ఆదిభట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి , మీర్ పేట్ సీఐ శోభన్ క్లూస్ టీంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. 

ముందే స్పందించి ఉంటే..

కాగా, తన భర్త దాడికి తెగబడతాడేమోనని సిద్ధిఖీ భార్య బుధవారం మధ్యాహ్నమే మీర్​పేట్​పీఎస్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయినా, చర్యలు తీసుకోకపోవడంతోనే రెండు ప్రాణాలు పోయాయని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తున్నారు.