- లండన్ వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో ప్రత్యేక పెవిలియన్ ఆరంభం
- హాజరైన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఎంపీ సుధామూర్తి
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ ట్రావెల్ మార్కెట్(డబ్ల్యూటీఎం)–2026లో తెలంగాణ పర్యాటకశాఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూకేలోని ఎక్సెల్ లండన్ వేదికగా ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ‘తెలంగాణ పెవిలియన్’ను కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. ఈనెల 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం 5 వరకు జరగనుండగా.. ఈ మెగా ఈవెంట్లో మన పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పెవిలియన్ అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పెవిలియన్‌లో రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సందర్శకులకు అందుబాటులో ఉంచారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయం, చారిత్రక వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, గోల్కొండ కోట, చార్మినార్లతో పాటు బుద్ధవనం, నాగార్జునసాగర్, అనంతగిరి హిల్స్, బొగత జలపాతం, లక్నవరం సరస్సు వంటి ప్రముఖ ప్రాంతాల ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. వీటితోపాటు రాష్ట్ర సంప్రదాయ చేనేత, హస్తకళలు, కళారూపాలు, ప్రత్యేక వంటకాలను విదేశీయులకు పరిచయం చేశారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ ‘మైస్’ హబ్‌గా ప్రమోట్ చేయడంతోపాటు విదేశీ పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో అధికారులు ముమ్మరంగా ‘బీ2బీ’ భేటీలు నిర్వహిస్తున్నారు. ‘తెలంగాణ జరూర్ ఆనా -అన్వేషించని అద్భుతాలను అనుభవించండి’ అనే నినాదంతో విదేశీ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు టూరిజం ఆఫీసర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శిక్తా పట్నాయక్, పర్యాటకశాఖ డైరెక్టర్ ఎల్.రంజీత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
