- రంగులు, డిజైన్లపై విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలె
- వచ్చే ఏడాది బడులు తెరిచిన రోజే అన్ని వస్తువులు అందాలె
- టెండర్ల నుంచి సరఫరా దాకా ఎస్‌వోపీ రూపొందించండి
- యూనిఫాంలు, కిట్ల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థులకు అందించిన యూనిఫాంలు ఎలా ఉన్నాయో వారి నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్లకే వచ్చే ఏడాది నుంచి ప్రాధాన్యం ఇవ్వొచ్చని చెప్పారు.
వచ్చే విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరిచిన రోజే యూనిఫాంలు, కిట్లు సహా అన్ని వస్తువులు విద్యార్థుల చేతికి అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థులకు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. గతంతో పోలిస్తే ఈసారి ఎంతో నాణ్యమైన యూనిఫాంలను ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో అందజేశామని అన్నారు.
95 శాతం పంపిణీ పూర్తి
యూనిఫాంలతో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. ఒకటి రెండు సంస్థల పరిధిలో కొన్ని వస్తువుల పంపిణీ 95 శాతం వరకు పూర్తయిందని చెప్పారు. మిగిలిన పంపిణీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
టైమ్ టేబుల్ ప్రకారమే అన్నీ వచ్చే ఏడాది విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు, ఇతర సామగ్రికి సంబంధించి ప్రామాణిక విధివిధానాలు (ఎస్‌వోపీ) రూపొందించాలని సీఎం ఆదేశించారు. వస్తువుల జాబితా తయారీ నుంచి టెండర్లు, సరఫరా, పంపిణీ దాకా ప్రతి పనీ నిర్దేశిత సమయంలో పూర్తి కావాలన్నారు.
