కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ త్వరలో విడుదల కాబోతున్నవేళ, సోషల్ మీడియాలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. 80 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో తన పుస్తక విశేషాలను పంచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారం రోజుల్లోనే 3 లక్షల ఫాలోవర్స్ సంపాదించు కోవడంతోపాటు, షేర్ చేసిన మూడు వీడియోలకు కలిపి రెండు కోట్ల వ్యూస్ సాధించారు. ఈ పుస్తకంపై అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎందుకంటే 1968లో ఇటలీ నుంచి వచ్చి, దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న నెహ్రూ-గాంధీ కుటుంబానికి కోడలైన ఒక మహిళ రాసిన జీవిత కథ ఇది. దాదాపు ఆరు దశాబ్దాలపాటు భారత రాజకీయాల్లో చోటుచేసుకున్న ఎన్నో నాటకీయ పరిణామాలకు ఆమె ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. 1991లో భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యతో చలించిపోయారు. దానికన్నా ఏడేళ్ల ముందు తీవ్రంగా గాయపడిన అత్త, అనాటి ప్రధాని ఇందిరా గాంధీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన విషాద క్షణాలనూ అనుభవించారు.
2012లో ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ సోనియా గాంధీని ప్రపంచంలోనే ఆరో అత్యంత శక్తిమంతమైన మహిళగా పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా గట్టెక్కించే కీలక నేతగా ఆమె గుర్తింపు పొందారు. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్, మాయావతి వంటి విభిన్న రాజకీయ భావజాలం ఉన్న నేతలతో సత్సంబంధాలు నెరపడంలో ఆమెది ప్రత్యేక శైలి. అటల్ బిహారీ వాజ్‌పేయితోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉండేవి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి, బయటి నుంచి మద్దతు ఇస్తున్న వామపక్షాలకు మధ్య ఎప్పుడు ఘర్షణ వాతావరణం నెలకొన్నా, స్వయంగా ఆమె రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దేవారు.
మోదీ బీజేపీ వర్సెస్ గాంధీ కుటుంబం అన్నట్లుగా రాజకీయం సాగుతున్న సమయంలో ఈ పుస్తకం రావడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ ‘బిలాంగింగ్’ (అందరిదాననై...) కేవలం సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, రాజీవ్‌తో ఆమె ప్రేమకథ మాత్రమే కాకపోవచ్చు. నెహ్రూ-–గాంధీ కుటుంబంపై ప్రత్యర్థులు నిత్యం చేసే ‘వంశపారంపర్య రాజకీయం’ అనే విమర్శలను తిప్పికొడుతూ, ఆ కుటుంబం చేసిన త్యాగాలను చాటిచెప్పే ప్రయత్నం కూడా కావొచ్చు. అత్తగారిలా ‘నేను నెహ్రూ కూతురిని కాదు’ అని ఆమెకు బాగా తెలుసు. అందుకే తాను ఆ కుటుంబ వారసత్వానికి ఒక సంరక్షకురాలిగానే బాధ్యత వహించారు.
ప్రధాని పదవి వద్దనుకున్నారు
దేశం ఇప్పటివరకు 14మంది ప్రధానులను చూసింది. అందులో నెహ్రూ-–గాంధీ కుటుంబం నుంచే ముగ్గురు.. నెహ్రూ (17 ఏళ్లు), ఇందిర (16 ఏళ్లు), రాజీవ్ (5 ఏళ్లు) పదవిలో ఉన్నారు. ఇక ప్రధాని పదవి అందివచ్చి దాన్ని తృటిలో కోల్పోయిన నేతలూ ఉన్నారు. కానీ, ప్రధాని పీఠం దానంతటదే వెతుక్కుంటూ వచ్చినా వద్దని తిరస్కరించిన సోనియా గాంధీ లాంటి వారు చాలా అరుదు.
2004లో కాంగ్రెస్ ఎంపీలందరూ ఆమెను నాయకురాలిగా ఎన్నుకున్నారు. యూపీఏ పక్షాలన్నీ ఆమెకు మద్దతిచ్చాయి. నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఆహ్వాన లేఖ కూడా సిద్ధం చేశారు. కానీ, సోనియా అనూహ్యంగా ఆ పదవిని నిరాకరించి, మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు.
దేశ చరిత్రలో ప్రధాని అవకాశాన్ని కాదనుకున్న నేత పశ్చిమ బెంగాల్‌ను పాతికేళ్లు ఏలిన సీనియర్ కమ్యూనిస్ట్ నేత జ్యోతిబసు.1996లో జ్యోతిబసుకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సీపీఐ(ఎమ్) పొలిట్‌బ్యూరో ఒప్పుకోలేదు. దాన్ని తరువాత ఆయన ‘చారిత్రక తప్పిదం’ అన్నారు. కానీ సోనియా గాంధీ చెప్పిన ‘నో’ మాత్రం చరిత్రలో అత్యంత నాటకీయమైనది.
ప్రధాని అయితే ఆరు నెలల్లోనే ఆమె హత్యకు గురవుతారనే భయంతో రాహుల్ గాంధీ వారించారని నట్వర్ సింగ్ తన పుస్తకంలో రాశారు. అలా దేశంలోనే అత్యున్నత పీఠాన్ని తృణప్రాయంగా వదులుకోవడం వల్ల సోనియాకు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఊహించని గౌరవం, ఆమోద యోగ్యత లభించాయి. అలా కోడలిగా మన దేశంలోకి అడుగుపెట్టి... ప్రజల్లో ఒకరైపోయారు.
ముగ్గురు ప్రధానులను ప్రభావితం చేసిన సోనియా
సోనియా రాజకీయ ప్రయాణం చాలా విచిత్రమైనది. భర్త రాజీవ్ గాంధీ (1984-89), పీవీ నరసింహారావు (1991-96), మన్మోహన్ సింగ్ (2004-14)... ముగ్గురు ప్రధానులను పరిణతితో ప్రభావితం చేసిన నేత మరొకరు లేరు! ఈ ముగ్గురు ప్రధానుల హయాంలో దేశంలో జరిగిన అతిపెద్ద పరిణామాలను ఆమె దగ్గరుండి గమనించారు. మండల్–-మందిర్ రాజకీయాల సెగలు, పంజాబ్,- కాశ్మీర్లలో అలజడులు, ఆర్థిక సంక్షోభంలో దేశ ఆర్థికవ్యవస్థ తలుపులు తెరవడం.. ఇలా ఎన్నో ఘట్టాలు ఆమె కళ్ల ముందే జరిగాయి.
చారిత్రక చట్టాలు తెచ్చిన ధీశాలి
414 సీట్లు సాధించిన కాంగ్రెస్ క్రమంగా బలహీనపడి, 18 పార్టీల సంకీర్ణానికి పరిమితమై, ఆ తర్వాత 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంలో అధికారానికి దూరమైంది. 1997లో కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు సోనియా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీని ముక్కలు కాకుండా కాపాడుకోవడంతో పాటు ‘హాత్... గరీబోంకి సాత్.’ నినాదంతో 2004లో అధికారంలోకి తీసుకువచ్చారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం వంటి చరిత్రాత్మక పథకాలు తీసుకురావడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. గత 12 ఏళ్లలో ఇలాంటి ఫ్లాగ్షిప్ చట్టాలు ఒక్కటీ రాలేదంటే... ఆమె మార్కును అర్థం చేసుకోవచ్చు.
పార్టీకి పునరుజ్జీవం
ప్రజారంజక పథకాలతోనే 2009లో కాంగ్రెస్‌ని మళ్లీ గెలిపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కాంగ్రెస్‌కు దూరమైన మైనారిటీల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోగలిగారు. కానీ, మారుతున్న హిందూ సమాజ మనస్తత్వాన్ని అంచనా వేయడంలో ఆమె విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. కేవలం తన కుమారుడు, రాహుల్ గాంధీ కోసమే పార్టీ బాధ్యతలను తన వద్ద ఉంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అన్నింటినీ తట్టుకుంటూ ఆమె ఏకంగా 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగి... కాంగ్రెస్ చరిత్రలోనే అత్యధిక కాలం అధ్యక్ష పదవిలో ఉన్న నేతగా రికార్డు సృష్టించారు.
అసాధ్యమనుకున్న తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నేత సోనియా గాంధీ నాయకత్వాన్ని సంపూర్ణంగా విశ్వసించి అండగా నిలబడ్డారు. ఆమె వెన్నంటి నిలిచి పార్టీని అధికారంలోకి తెచ్చారు. వైఎస్సార్ అకాల మరణం తర్వాత రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి.
ఒకవైపు ఆంధ్రాలో రాజకీయంగా భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంతా హెచ్చరించినప్పటికీ... సోనియా వెనకడుగు వేయకుండా..ఇచ్చిన మాటకు కట్టుబడి, తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను, సెంటిమెంట్‌ను గౌరవిస్తూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ నష్టం ముందే తెలిసినా, ప్రజల ఆకాంక్షే ముఖ్యమని భావించి ఆమె తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం..ఇవాళ మరెవరైనా తీసుకోగలరా? అంటే అది సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతుంది.
సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం ద్వారా దేశంలోని రాజకీయ విశ్లేషకులకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు. కానీ సామాన్య పాఠకుడికి మాత్రం... అసలు ఇటలీ నుంచి వచ్చిన ఒక సాధారణ మహిళ, రాజకీయాలంటేనే ఇష్టంలేని ఆమె, ఇందిరా గాంధీ ఇంట్లో ఉంటూనే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తి.. చివరికి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగారు? అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ రాసిన ఈ ఆత్మకథ దేశ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపడం ఖాయం!
గణేశ్ తండ, రీసెర్చర్
* ఓపెన్పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
