జన్నారం/రూరల్, వెలుగు : చివరి దశలో ఉన్న వరి పంటకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన రైతులు బుధవారం చింతగూడ గ్రామ సమీపంలోని మెయిన్ రోడ్డు పై రాస్తారోకో నిర్వహించారు.
కడెం ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతున్న సాగు నీటిని ఈనెల 7 నుంచి నిలిపివేస్తామని ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పుడు మొత్తానికే సాగు నీటిని నిలిపివేస్తే పంటలన్నీ ఎండిపోయి తీవ్ర నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న ఎస్పై ఉదయ్ కిరణ్ రాస్తారోకో వద్దకు చేరుకొని ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లతో మాట్లాడి సాగు నీటిపై హమీ ఇప్పించడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ తో పాటు చింతగూడ కు చెందిన రైతులు పాల్గొన్నారు.
