విచారణ చేయరు.. ఎక్స్ గ్రేషియా ఇవ్వరు..ఇబ్బందుల్లో బాధిత కుటుంబాలు ..పట్టించుకోని కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారులు

విచారణ చేయరు.. ఎక్స్ గ్రేషియా ఇవ్వరు..ఇబ్బందుల్లో బాధిత కుటుంబాలు ..పట్టించుకోని కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారులు
  •  అప్పుల ఊబిలో ఆత్మహత్య చేసుకున్న 18 రైతు కుటుంబాలు
  •  రీఎంక్వైరీ చేసి రిపోర్టు ఇస్తే పరిహారం పొందే అవకాశం

సైదాపూర్ మండలం ఆకునూరుకు చెందిన గంగం లింగారెడ్డికి భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. రెండెకరాల సొంత భూమితోపాటు ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. సరైన దిగుబడి రాకపోవడం, అప్పటికే రూ.7.50 లక్షల వరకు అప్పులు కావడంతో తీర్చే మార్గం లేక 2021 డిసెంబర్ 21న ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చేందుకు తాను కూలీనాలీ చేయాల్సి వస్తోందని, అప్పులు ఇచ్చినోళ్లు ఇంటిచుట్టూ తిరిగి పోతున్నారని లింగారెడ్డి భార్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.

 
కరీంనగర్, వెలుగు : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల మరణాలపై రీఎంక్వైరీ చేసి రిపోర్టు ఇవ్వడంలో కరీంనగర్ రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 18 మంది రైతుల మరణాలపై ఎంక్వైరీ చేసి, వారు అప్పుల బాధతోనే చనిపోతే పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదు. దీంతో ఏండ్లు గడిచినా ఎక్స్ గ్రేషియా అందక బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాయి. 

రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో 200 మంది రైతులు.. !

తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటి నాలుగేండ్ల వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలంటే త్రిమెన్(తహసీల్దార్, ఎస్సై, అగ్రికల్చర్ ఆఫీసర్) కమిటీ అప్రూవ్ చేయాల్సి ఉండేది. 2018 ఆగస్టు 15 నుంచి అప్పటి టీఆర్ఎస్ సర్కార్ రైతు బీమా అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పట్టాదారు పాస్ బుక్ కలిగిన రైతు చనిపోతే ఎక్స్ గ్రేషియా అందేది. అయితే అప్పుల బాధతో కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో త్రిమెన్ కమిటీ గుర్తించని, అలాగే బీమా వర్తించకుండపోయిన నిజమైన కుటుంబాలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 2023 వరకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సుమారు 200 మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రైతు స్వరాజ్య వేదిక నేత కొండల్ రెడ్డి హైకోర్టులో 2025 జనవరిలో పిల్ వేశారు. ఈ రైతులంతా అప్పుల బాధతోనే చనిపోయినట్లు ఎఫ్ఐఆర్ లో, చార్జీ షీట్ లో పోలీసులు పేర్కొన్న విషయాన్ని పిటిషన్ లో ప్రస్తావించారు. దీంతో విచారించిన హైకోర్టు ఆయా రైతుల ఆత్మహత్యలపై రీఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

కరీంనగర్ లో ఒక్క ఎంక్వైరీ పూర్తి కాలే.. 

రాష్ట్రంలో జరిగిన 200 ఆత్మహత్యల్లో ఇప్పటికే 90 మంది రైతుల ఆత్మహత్యలపై రీఎంక్వైరీ రిపోర్టులు సెక్రటేరియట్ కు చేరాయి. దీంతో ఆయా కుటుంబాలు ఎక్స్ గ్రేషియాకు అర్హత సాధించాయి. కరీంనగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 18 మంది రైతుల్లో ఏ ఒక్కరి మరణంపై ఇప్పటి వరకు రీఎంక్వైరీ చేయకపోవడం గమనార్హం. వీరికి సంబంధించి పోలీసు ఫైనల్ రిపోర్టులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కుటుంబానికి సంబంధించిన విచారణ ప్రక్రియ కూడా పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో బాధిత కుటుంబాలు తమ సమస్యను పరిష్కరించాలని అనేకసార్లు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కడం లేదు.

ఆఫీసర్లలో చలనం లేదు.. 

గెక్స్​గ్రేషియా కోసం మేం పదేపదే అధికారులను కలిసినా వారిలో ఎలాంటి చలనం ఉండట్లేదు.  బాధితులు ఎన్నోసార్లు  విజ్ఞప్తి చేస్తున్నా స్పందన లేకపోతే ఇక వారు ఎవరిని ఆశ్రయించాలి? అనేక పర్యాయాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీఓలను పలుమార్లు కలిశాం. కానీ ఇంతవరకు ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరగలేదు. అధికారులను అడిగిన ప్రతిసారీ ‘రిమైండర్లు పంపిస్తున్నాం’ అనే సమాధానమే వస్తోంది తప్ప అంతకుమించి జరగడం లేదు.
– బి. కొండల్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, రైతు స్వరాజ్య వేదిక-
  
కూలి పని చేసి వడ్డీలు కడుతున్న..

 నా భర్త కనుమల్ల పోశెట్టి తనకు ఉన్న ఎకరం తొమ్మిది గుంటల భూమితోపాటు మరో మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పంట సాగు చేసిండు. పెట్టుబడుల కోసం రూ.3 లక్షలకుపైగా అప్పు చేసిండు. ఆ అప్పులు తీర్చలేక 2023 జనవరిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నడు. 

దీంతో నేనే కూలి పనులు చేస్తూ అప్పులకు మిత్తి కడుతున్న. అప్పట్లో ఒకసారి గిర్దావర్ పొలం దగ్గరికి వచ్చి వివరాలు తీసుకొనిపోయిండు. మాకు సాయం చేయాలని కలెక్టర్ తో పాటు ప్రజావాణిలో కూడా దరఖాస్తులు ఇచ్చిన. కానీ నా భర్త సచ్చిపోయి మూడేండ్లవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు.-
-కనుమల్ల లక్ష్మి, ఇల్లందకుంట -