అండాల దందా వెనుక అద్దె గర్భాల ముఠా.. ఒక్కో బిడ్డకు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షలు !

అండాల దందా వెనుక అద్దె గర్భాల ముఠా.. ఒక్కో బిడ్డకు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షలు !
  • సంతానం లేని దంపతులే టార్గెట్
  • ఫెర్టిలిటీ సెంటర్ల నుంచే బ్రోకర్లకు సమాచారం
  • ఇతర రాష్ట్రాల పేద యువతులు, 
  • హాస్టల్ వర్కింగ్ విమెన్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందాలు
  • నకిలీ ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు స్వాధీనం
  • క్లినిక్‌‌‌‌‌‌‌‌లు, పీజీ హాస్టళ్లపై దాడులకు పోలీసుల ప్లాన్

‘‘ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన దంపతులకు సంతానం లేదు. భార్యకు గర్భం దాల్చే  అవకాశం లేకపోవడంతో పలు ఫెర్టిలిటీ సెంటర్లు తిరిగారు. ఈ క్రమంలో వారిని ఓ బ్రోకర్ కలిశాడు. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ పీజీ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న యువతితో డీల్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. భర్త స్పెర్మ్​తో పిల్లలను కని ఇచ్చేందుకు అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఇందుకు రూ.10 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అండాలు, స్మెర్మ్​సేకరణ ముఠాల వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో  బ్రోకర్లు, ఫెర్టిలిటీ సెంటర్లు కలిసి నడుపుతున్న ఇలాంటి  దందాలు బయటకు వస్తున్నాయి.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అండాల దందా కేసు దర్యాప్తులో అద్దె గర్భాల (సరోగసీ) వ్యవహారం బయటపడింది. యువతులకు డబ్బు ఆశ చూపి అండాలు సేకరిస్తున్న ముఠా, అదే యువతులతో సరోగసీ ద్వారా పిల్లలను కనిపించి దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్లకు వచ్చే దంపతుల్లో గర్భం దాల్చలేని మహిళలను ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి.

ఒక్కో బిడ్డ కోసం దంపతుల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. భర్త వీర్యంతోనే బిడ్డ పుట్టడం, ఆ తర్వాత ఆ దంపతుల సంతానంగానే బర్త్ సర్టిఫికెట్లు ఇస్తుండటంతో చాలామంది సరోగసీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. 

ఇటీవల బేగంపేట, సరూర్‌‌నగర్, ఎర్రగడ్డ, గోపాలపురంలోని అండాల సేకరణ కేంద్రాలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు దాడులు చేసి, ప్రధాన నిందితుడు అమిత్ శర్మ సహా 9 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. అండాలు ఇచ్చేందుకు వచ్చిన 43 మంది మహిళల నుంచి సరోగసీకి సంబంధించిన కీలక వివరాలు రాబట్టారు. దీని వెనుక ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లు, క్లినిక్‌‌లు, వివిధ రాష్ట్రాల బ్రోకర్ల నెట్‌‌వర్క్‌‌ను ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు.

ఫెర్టిలిటీ సెంటర్ల నుంచే సమాచారం
గర్భం దాల్చలేని మహిళల సమాచారం కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు, క్లినిక్‌‌ల ద్వారానే బ్రోకర్లకు చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రోకర్లు ఇలాంటి దంపతులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నారు. ఒకటి, నేరుగా బిడ్డను కొనడం. రెండు, మరో యువతి ద్వారా సరోగసీలో బిడ్డను కనిపించడం. బిడ్డను కొంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి, సరోగసీ వైపు మళ్లిస్తున్నారు. 

సరోగసీకి ఒప్పుకునే యువతులు ఎత్తుగా, తెల్లగా ఉంటే అందమైన పిల్లలు పుడతారంటూ దంపతులకు వల వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతుల ఫొటోలు దంపతులకు చూపించి, నచ్చినవారితో అగ్రిమెంట్లు చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చట్టం ఏం చెబుతోంది ?
దేశంలో డబ్బుల కోసం గర్భం మోసే కమర్షియల్ సరోగసీ పూర్తిగా నిషేధం  ఉంది. సరోగసీ (రెగ్యులేషన్) చట్టం–2021 ప్రకారం వైద్యపరమైన అవసరం ఉన్న దంపతులకు, ఖర్చులు మినహా ఎలాంటి డబ్బు చెల్లింపు లేని ‘ఆల్ట్రూయిస్టిక్’ సరోగసీకి మాత్రమే, అదీ అధికారుల అనుమతితోనే అవకాశం ఉంది. కమర్షియల్ సరోగసీకి పాల్పడితే పదేండ్ల వరకు జైలు, రూ.10 లక్షల వరకు జరిమానా విధించొచ్చు. అండాల దానం కూడా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్టం కింద కఠిన నిబంధనలతో, రిజిస్టర్డ్ కేంద్రాల్లోనే జరగాలి.

ఇతర రాష్ట్రాల యువతులే ఎక్కువ
స్థానిక యువతులతో భవిష్యత్తులో ఇబ్బందులు రావొచ్చని, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన పేద యువతులను సరోగసీకి ఒప్పించి హైదరాబాద్‌‌కు తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పీజీ హాస్టళ్లలో ఉంటున్న వర్కింగ్ విమెన్‌‌ను కూడా బ్రోకర్లు ఒప్పిస్తున్నారు. బిడ్డ కోసం వచ్చే దంపతులకు గర్భం మోసే యువతితో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు. 

9 నుంచి 10 నెలల పాటు వ్యవహారమంతా మధ్యవర్తుల ద్వారానే నడుస్తుంది. నెలకోసారి ఫొటోలు చూపిస్తూ ఒప్పందం చేసుకున్న డబ్బును విడతల వారీగా వసూలు చేస్తున్నారు. పూర్తి డబ్బులు ఇచ్చాకే బిడ్డను చేతిలో పెడుతున్నారు. ఈ డబ్బులో సగానికి పైగా బ్రోకర్లు, కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు, క్లినిక్‌‌లు కమీషన్ల రూపంలో నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది.

శివారు క్లినిక్‌‌లు, పీజీ హాస్టళ్లు అడ్డాగా..
మైలార్‌‌దేవ్‌‌పల్లి, కాటేదాన్ ఓబుల్‌‌రెడ్డి నగర్‌‌లోని కొన్ని క్లినిక్‌‌లు, బంజారాహిల్స్, అమీర్‌‌పేట పరిసరాల్లోని కొన్ని పీజీ హాస్టళ్లు అడ్డాగా ఈ దందా నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సరోగసీకి ఒప్పుకుంటున్న మహిళల నకిలీ ఆధార్ కార్డులు, అఫిడవిట్లు, అగ్రిమెంట్ పత్రాలు, పిల్లలు పుట్టిన తర్వాత ఇచ్చే కొన్ని బర్త్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అండాల సేకరణ ముఠాను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళల అక్రమ రవాణా కోణం కూడా ఉండటంతో పీజీ హాస్టళ్లు, ఫెర్టిలిటీ సెంటర్లు, క్లినిక్‌‌లపై దాడులకు సిద్ధమవుతున్నారు.

గతంలోనూ ఇలాంటి దందాలు
హైదరాబాద్ కేంద్రంగా యువతుల నుంచి అండాలు, యువకుల నుంచి వీర్యం అక్రమంగా సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు గతంలోనూ బయటపడింది. రోజువారీ కూలీలు, యువకులు, యాచకుల నుంచి వీర్యకణాలు, అండాలు సేకరిస్తున్న సికింద్రాబాద్‌‌లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌‌పై గతేడాది టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అక్రమంగా సేకరించిన వీర్యకణాలు, అండాలను దేశంలోని వివిధ నగరాల ఫెర్టిలిటీ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు అప్పట్లో గుర్తించారు.