- కేంద్రానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం
- ఢిల్లీలో ఆందోళన చేస్తోన్న విద్యార్థులకు మద్దతు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్టాత్మక హిందూ కాలేజ్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా గత నెలన్నరగా కాలేజీ విద్యార్థులు, ప్రొఫెసర్లు చేస్తున్న ఆందోళనకు ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... 130 ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ కాలేజ్ దేశానికి ఎంతో మంది మేధావులను అందించిందని, ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కాలేజ్ నిర్వహణకు నిధులు ఇచ్చినంత మాత్రాన ప్రైవేట్ సంస్థలకు యాజమాన్య హక్కులు కట్టబెట్టడం సరికాదని మండిపడ్డారు.
యూజీసీ నిబంధనల ప్రకారం డొనేషన్లు ఇచ్చే సంస్థలకు పరిమితమైన సౌకర్యాలు మాత్రమే కల్పించాలని స్పష్టం చేశారు. నిధుల సాకుతో కాలేజ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తే గట్టిగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. కాలేజ్ అడ్మిషన్లలో జరుగుతున్న అవకతవకలు, ప్రైవేటీకరణ యత్నాలపై విద్యార్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని కవిత ప్రశ్నించారు. జవాబు చెప్పకుండా విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తే నిరసనలు మరింత తీవ్రమవుతాయని, బాధితుల వైపు తాము అండగా నిలబడతామని హెచ్చరించారు.
చంద్రబాబుకు 250 టీఎంసీలు గిఫ్ట్ ఇచ్చిన్రు
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు లోపాయికారిగా అంగీకారం తెలపడం ద్వారా రేవంత్ సర్కార్ తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెడుతోందని కవిత ఆరోపించారు. గోదావరిలో తెలంగాణకు దక్కాల్సిన 250 టీఎంసీల నీటి వాటాను తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా సమర్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్‌లో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనమన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన సీఎంల సమావేశంలోనూ రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారని, తెరవెనుక పూర్తి సహకారం అందిస్తూ.. మీడియా ముందుకొచ్చి బనకచర్లను వ్యతిరేకిస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
