- ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం
- ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి వేడుకలు, ఖేలో ఇండియా ఏర్పాట్లపై సమీక్ష
- తుమ్మిడిహట్టి, ఎల్నినో ప్రభావంపై చర్చించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం 6వ అంతస్తులోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు మొదట ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై ఇన్ఫార్మల్ కేబినేట్ భేటీ జరగనుండగా, అనంతరం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా 38వ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ పై చర్చించనున్నారు.
డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో జరగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి వేడుకల నిర్వహణపై సమీక్షించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసిన 4.5 లక్షల ఇండ్లలో.. ఇప్పటివరకు గృహప్రవేశాలు పూర్తయిన 2,21,500 ఇండ్లలో లబ్ధిదారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు దీపావళి సంబరాల్లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై కేబినెట్ సమీక్షించనుంది.
ఇటీవల మహారాష్ట్ర సీఎంతో జరిపిన చర్చలు, ఆ తర్వాత మహారాష్ట్ర అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నెలకొన్న పరిస్థితులను నీటిపారుదల శాఖ అధికారులు వివరించనున్నారు. మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాల నివృత్తి, అంతర్రాష్ట్ర సరిహద్దు అనుమతులపై ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే విషయమై రూట్మ్యాప్ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇక, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలిసింది. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో తాగునీరు, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయంపై ఒత్తిడి తేవడం లాంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు పలు శాఖల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
