అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని చారిత్రక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో.. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా జరిగిన రక్షా ఎక్స్పో–2026 సన్నాహక కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రక్షణ రంగంలో ఆసక్తి ఉన్న సంస్థలు తెలంగాణలో తమ పెట్టుబడులను మరింత విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న రక్షా ఎక్స్పో–2026 ఈ ప్రయత్నాలకు మరింత ఊతమివ్వనుంది.
రక్షణ పరిశోధన, క్షిపణి సాంకేతికత, విమానయాన పరికరాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ రంగాలకు సంబంధించిన అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. డీఆర్‌డీఓకు చెందిన పరిశోధనా కేంద్రాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మిశ్ర ధాతు నిగమ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ వంటి భారతీయ ప్రైవేటు సంస్థలు ఈ పారిశ్రామిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సికోర్స్కీ, సఫ్రాన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా స్వయంగా లేదా భారతీయ భాగస్వామ్య సంస్థల ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ అంతర్జాతీయ విమానయాన, రక్షణ సరఫరా వ్యవస్థల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పరిశోధన, ఇంజినీరింగ్ నైపుణ్యం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఒకేచోట అందుబాటులో ఉండటం కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి చోదకశక్తిగా నిలుస్తోంది.
చిన్న పరిశ్రమలకూ పెద్ద పీట
స్థూల దేశీయోత్పత్తికి వెన్నుదన్నుగా నిలిచే రక్షణ రంగ భారీ పరిశ్రమలకు తోడుగా అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందితే, ఈ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనం మరింత విస్తృతమవుతుంది.
ఒక విమానం, హెలికాప్టర్, రాడార్ వ్యవస్థ లేదా క్షిపణి తయారీ వెనుక వందల రకాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్రత్యేక లోహాలు, కేబుళ్లు, సాఫ్ట్వేర్, పరీక్షా సేవలు, నాణ్యతా నియంత్రణ, నిర్వహణ వంటి అనేక కార్యకలాపాలు ఉంటాయి. వీటిలో అనేక రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములు కావచ్చు. తద్వారా పెద్ద పెట్టుబడుల ప్రభావం ప్రత్యక్ష ఉద్యోగాలకే పరిమితం కాకుండా చిన్న వ్యాపారాల ఆదాయం, నైపుణ్యాల అభివృద్ధి, స్థానిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు కూడా దోహదపడుతుంది. అయితే రక్షణ రంగానికి సరఫరాదారుగా మారడం సాధారణ వాణిజ్య లావాదేవీ కాదు.
కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, ధ్రువీకరణ, సాంకేతిక సామర్థ్యం, నిరంతర సరఫరా విశ్వసనీయత అవసరం. ఈ అర్హతలను సాధించేందుకు స్థానిక ఎంఎస్ఎంఈలకు సాంకేతిక మార్గదర్శకత్వం, పరీక్షా సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం కల్పించాలి. తెలంగాణలో ఇప్పటికే అందుబాటులో ఉన్న పారిశ్రామిక, ఆవిష్కరణల మౌలిక సదుపాయాలను ఈ అవసరాలకు అనుసంధానించుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీ-వర్క్స్ సంస్థ హార్డ్‌వేర్ ఉత్పత్తుల నమూనాల రూపకల్పన, ప్రోటోటైపింగ్, ఉత్పత్తి అభివృద్ధికి అవసరమైన సదుపాయాలను స్టార్టప్‌లు, చిన్న సంస్థలకు అందిస్తోంది.
మరోవైపు టీ-హబ్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భాగస్వామ్య ఇంక్యుబేటర్‌గా పనిచేస్తూ.. రక్షణ రంగ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేసే స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం, పరిశ్రమలతో అనుసంధానం వంటి అవకాశాలను కల్పిస్తోంది. ఈ అనుభవాన్ని మరింత విస్తరించి, రక్షణ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న పెద్ద సంస్థల అవసరాలకు అనుగుణంగా స్థానిక ఎంఎస్ఎంఈలను సిద్ధం చేస్తే పెట్టుబడుల ప్రయోజనాలు అట్టడుగుస్థాయి వరకూ చేరతాయి.
యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి
రక్షణ, ఏరోస్పేస్ రంగాల విస్తరణ ద్వారా ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, కంప్యూటర్ ఆధారిత రూపకల్పన, సైబర్ భద్రత, సాఫ్ట్ వేర్, నాణ్యతా పరీక్షలు, పారిశ్రామిక నిర్వహణ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన సిబ్బందికి గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ విద్యాసంస్థలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో ముందుగానే గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ, అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాలు రూపొందిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
అభివృద్ధి హైదరాబాద్‌ను దాటి విస్తరించాలి
రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాల తయారీ, ఎలక్ట్రానిక్స్, నిర్వహణ సేవలు, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలను తెలంగాణలో హైదరాబాద్ వెలుపల అనువైన పారిశ్రామిక ప్రాంతాలకు విస్తరించడం అభివృద్ధి వికేంద్రీకరణకు సహాయపడుతుంది. హైదరాబాద్‌లోని ప్రధాన సంస్థలతో ఇతర ప్రాంతాల్లోనూ అనుబంధ పరిశ్రమలకు సరఫరా సంబంధాలు ఏర్పడితే అభివృద్ధి మరింత విస్తృతమవుతుంది.
ఉపాధి కోసం యువత పెద్ద నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. స్థానిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. ఈ పరిణామం తెలంగాణ రైజింగ్–2047 దార్శనికతలో నిర్దేశించిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విస్తరించడం, జాతీయ స్థూల దేశీయోత్పత్తిలో రాష్ట్ర వాటాను పెంచడం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాల సాధనకు ఈ రంగం గణనీయంగా తోడ్పడగలదు.
పెట్టుబడుల ఆకర్షణతో పాటు జవాబుదారీతనం
పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఎంత ఉత్పత్తి జరిగింది, ఎన్ని ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి, స్థానిక సంస్థలకు ఎన్ని సరఫరా అవకాశాలు లభించాయి, ఎగుమతులు ఎంత పెరిగాయనే వివరాలను క్రమం తప్పకుండా సమీక్షించాలి. ప్రభుత్వ రాయితీలు ప్రజాధనంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి వాటి ప్రతిఫలం కూడా ప్రజలకు స్పష్టంగా కనిపించాలి.
కొత్త పరిశ్రమలకు భూమి, విద్యుత్, రవాణా, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో జాప్యాన్ని నివారించాలి. రక్షణ రంగ పెట్టుబడులు తెలంగాణకు నిజమైన శ్రీరామరక్ష కావాలంటే, అవి కొద్ది పెద్ద సంస్థల వృద్ధికే పరిమితం కాకుండా స్థానిక పరిశ్రమలకు బలం, యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి, రాష్ట్రానికి స్థిరమైన ఆర్థికాభివృద్ధిని అందించినప్పుడే ఈ అవకాశానికి అసలైన సార్థకత చేకూరుతుంది.
కృష్ణ బాలాజీ పల్లపోతు
