ఇబ్రహీంపట్నం, వెలుగు: కాబోయే డాక్టర్లు చదువుకునే మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు సైతం ఇంత అధ్వానంగా లేవన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలోని బీఐఈటీ క్యాంపస్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల మూడో రోజు ధర్నాకు బుధవారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు.
విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ బడులు కూడా మెరుగైన వసతులతో ఉండేవని, ప్రస్తుతం హైదరాబాద్‌కు సమీపంలోని ప్రతిష్ఠాత్మక మెడికల్ కాలేజీ పరిస్థితి దారుణంగా మారిందన్నారు.
విజన్ 2047, ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి కాబోయే డాక్టర్లకు కనీస వసతులు కల్పించలేకపోతున్నారని విమర్శించారు.
సౌలత్లు లేని మెడికల్ కాలేజీలో చదివేదెట్ల అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, భవన అద్దె చెల్లించకపోవడంతో యజమాని భవనాన్ని పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. దీంతో తాగునీరు, వాష్‌రూమ్‌లు, విద్యుత్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ల్యాబ్‌లు, లైబ్రరీ, హాస్టల్ వసతులు కూడా లేవన్నారు.
2022– -23లో మహేశ్వరం మెడికల్ కాలేజీ మంజూరైనప్పుడు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడంతోపాటు కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణానికి కేసీఆర్ రూ.182 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. 400 పడకల ఆస్పత్రికి కూడా శంకుస్థాపన చేశామన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారించలేదని విమర్శించారు. కలెక్టర్ నారాయణరెడ్డి, డీఎంఈ వాణీదేవి వెంటనే స్పందించి విద్యార్థులతో చర్చించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
