ఎర్రవెల్లిలో ఎందుకు?చేతనైతే మియాపూర్ భూములివ్వండి : కేటీఆర్

ఎర్రవెల్లిలో ఎందుకు?చేతనైతే మియాపూర్ భూములివ్వండి : కేటీఆర్
  • 100 ఎకరాల్లో అమరుల కుటుంబాలకు ప్లాట్లు కేటాయించండి: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: అమరవీరుల కుటుంబాలకు ఎర్రవెల్లిలో కాకుండా మియాపూర్ భూముల్లోని100 ఎకరాల్లో స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్​ చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఎర్రవెల్లిలో ఇండ్లు కట్టిస్తామని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఎక్కడో ఎర్రవెల్లిలో ఎందుకని..చేతనైతే మియాపూర్ ల్లోనే వారికి స్థలాలు కేటాయించాలన్నారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ భవన్‌‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలో చేరారు.

అనంతరం కేటీఆర్​మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను అమ్మేసేందుకు సర్కారు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే మియాపూర్ భూములపై సర్కారు కన్ను పడిందని.. ప్రజల ఆస్తిని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు. మియాపూర్‌‌‌‌లోని 550 ఎకరాల్లో 100 ఎకరాలను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కేటాయించి, మరో 200 ఎకరాల్లో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హైడ్రాతో రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, భూముల విలువలు భారీగా పడిపోయాయన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో రూ.లక్ష కోట్ల విలువైన 10 వేల ఎకరాల పారిశ్రామిక భూములను అప్పనంగా అమ్మేసేందుకు ప్లాన్​ చేశారన్నారు. రేవంత్ సర్కారు వలలో పడి హిల్ట్ పాలసీ భూములు కొంటే పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. తాము అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీ అక్రమాలకు కచ్చితంగా చెక్ పెడతామని కేటీఆర్ పేర్కొన్నారు.