పట్టుదలతో కొలువు సాధించాలి ..ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో మంత్రి సీతక్క

పట్టుదలతో కొలువు సాధించాలి ..ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో మంత్రి  సీతక్క

వెంకటాపూర్ (ములుగు ), వెలుగు: యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు.  ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు. 

బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆమె పరిశీలించారు. అభ్యర్థులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు, కల్పించిన సౌకర్యాలను తెలుసుకున్నారు. అభ్యర్థులు లక్ష్యంపై దృష్టి సారించి, క్రమశిక్షణతో శిక్షణ పొందాలని సూచించారు. 

వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం  జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పాఠశాల విద్యాశాఖ- ఆధ్వర్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలు-2027 విద్యార్థుల సంసిద్ధతపై ఎంఈఓలు, హెచ్​ఎంలతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆమె హాజరయ్యారు.  విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులు స్ఫూర్తిగా నిలుస్తారని  సీతక్క అన్నారు. 

విద్యా ఫలితాల్లో ములుగు జిల్లా మరోసారి ప్రభంజనం సృష్టించాలని సూచించారు. టీచర్లు సిలబస్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసి, పునశ్చరణ, సాధన పరీక్షల ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించాలన్నారు.  ములుగు జిల్లా విద్యతోపాటు రహదారులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ రేగ కళ్యాణి,  జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనార్ధన్, జీసీడీఓ తదితరులు పాల్గొన్నారు.