కిలోమీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.9.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వియత్నాం ఈ- క్యాబ్స్‌‌‌‌‌‌‌‌.. 12 గంటలు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే రూ.35 వేల జీతం !

కిలోమీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.9.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వియత్నాం ఈ- క్యాబ్స్‌‌‌‌‌‌‌‌.. 12 గంటలు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే రూ.35 వేల జీతం !
  • ఇదే రేటుతో ఇప్పటికే ఢిల్లీలో సేవలు 
  • సొంత డ్రైవర్లను నియమించుకోనున్న సంస్థ
  • 12 గంటలు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే రూ.35 వేల జీతం

హైదరాబాద్ సిటీ, వెలుగు: కిలోమీటర్‌‌‌‌‌‌‌‌కు కేవలం రూ.9 ఛార్జీతో వియత్నాంకు చెందిన గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎం ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ క్యాబ్స్‌‌‌‌‌‌‌‌ త్వరలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రోడ్ల పైకి రానున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఇదే రేటుతో సేవలు అందిస్తున్న ఈ సంస్థ.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

తక్కువ ధరకు ప్రయాణం అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికులకు ఊరట కలిగే అవకాశముంది. అయితే ఈ కొత్త సంస్థ రాకతో ఓలా, ఉబెర్‌‌‌‌‌‌‌‌, ర్యాపిడో క్యాబ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

తెలంగాణలో ఎలక్ట్రిక్‌‌ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2025 డిసెంబర్‌‌ 9న తెలంగాణ ప్రభుత్వం, వియత్నాంకు చెందిన విన్‌‌గ్రూప్‌‌ మధ్య సుమారు 3 బిలియన్‌‌ డాలర్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందం కుదిరింది. విన్‌‌గ్రూప్‌‌లో భాగమైన గ్రీన్‌‌ ఎస్‌‌ఎం ప్రధానంగా ఎలక్ట్రిక్‌‌ వాహనాలతో క్యాబ్‌‌ సేవలు నిర్వహిస్తోంది. 

ఈ ఒప్పందంలో ఎలక్ట్రిక్‌‌ మొబిలిటీ, క్యాబ్‌‌ సేవలు, ఛార్జింగ్‌‌ కేంద్రాలు, స్మార్ట్‌‌ సిటీ తదితర రంగాలు ఉన్నాయి. ఇప్పటికే 2026 జూన్‌‌ 5న ఢిల్లీ ఎన్‌‌సీఆర్‌‌లో వెయ్యి ఎలక్ట్రిక్‌‌ కార్లతో సేవలు ప్రారంభించింది. భవిష్యత్తులో వీటిని 10 వేల వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌‌లోనూ గ్రీన్‌‌ ఎస్‌‌ఎం కార్లు కనిపిస్తుండటంతో సంస్థ కార్యకలాపాల విస్తరణపై ఆసక్తి నెలకొంది.

గ్రీన్‌‌ క్యాబ్స్‌‌తో కాలుష్యానికి చెక్‌‌..
ఎలక్ట్రిక్‌‌ క్యాబ్స్‌‌ రాకతో నగరంలో వాయు, శబ్ద కాలుష్యం కొంతమేర తగ్గే అవకాశముంది. ప్రస్తుతం పెట్రోల్‌‌, డీజిల్‌‌ క్యాబ్స్‌‌ నుంచి వెలువడే పొగకు బదులుగా ఎలక్ట్రిక్‌‌ కార్లు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లు, ఎయిర్‌‌పోర్టు మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో వీటి వినియోగం పెరిగితే ప్రయోజనం ఉంటుంది. 

ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు ప్రయాణికులకు ఆధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అయితే పెద్ద సంఖ్యలో కార్లు రోడ్లపైకి వస్తే వాటికి సరిపడా ఛార్జింగ్‌‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బ్యాటరీల నిర్వహణ, విద్యుత్‌‌ అవసరాలు, బ్యాటరీ వ్యర్థాల తొలగింపు కూడా సవాళ్లుగా మారనున్నాయి.

ఓలా, ఉబెర్‌‌ డ్రైవర్లలో ఆందోళన..
ప్రస్తుతం ఢిల్లీలో గ్రీన్‌‌ ఎస్‌‌ఎం క్యాబ్స్‌‌ కిలోమీటర్‌‌కు రూ.9 వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌‌లో ఓలా, ఉబెర్‌‌ వంటి సంస్థలు సాధారణంగా కిలోమీటర్‌‌కు రూ.15 నుంచి రూ.20 వరకు ఛార్జీ వసూలు చేస్తున్నాయి. ట్రాఫిక్‌‌, డిమాండ్‌‌, కారు రకాన్ని బట్టి ఈ ధరలు మారుతుంటాయి. ఈ సంస్థలు డ్రైవర్ల నుంచి 20 నుంచి 30 శాతం వరకు కమిషన్‌‌ తీసుకుంటున్నాయి.

ర్యాపిడో క్యాబ్స్‌‌ మాత్రం రోజువారీ సబ్‌‌స్క్రిప్షన్‌‌, చిన్న పాస్‌‌ విధానం ద్వారా జీరో కమిషన్‌‌ మోడల్‌‌ను కూడా అందిస్తోంది. ఉదాహరణకు రోజుకు రూ.3 వేల గ్రాస్‌‌ ఆదాయం వచ్చే క్యాబ్‌‌ డ్రైవర్‌‌కు కంపెనీ కమిషన్‌‌ లేదా సబ్‌‌స్క్రిప్షన్‌‌ కింద రూ.100 నుంచి రూ.600 వరకు ఖర్చవుతుంది.

పెట్రోల్‌‌, సీఎన్‌‌జీ కోసం రూ.700 నుంచి రూ.900, మెయింటెనెన్స్‌‌, టోల్స్‌‌కు మరో రూ.200 నుంచి రూ.300 ఖర్చవుతాయి. ఇవన్నీ పోను డ్రైవర్‌‌కు రోజుకు రూ.1,200 నుంచి రూ.1,600 వరకు మిగులుతుంది. గ్రీన్‌‌ క్యాబ్స్‌‌ తక్కువ ఛార్జీలతో అందుబాటులోకి వస్తే ప్రయాణికులు వాటివైపే మొగ్గు చూపుతారని, దీంతో తమ ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని ఓలా, ఉబెర్‌‌, ర్యాపిడో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ గిగ్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌ 2026 ఫిబ్రవరిలో వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది క్యాబ్‌‌ డ్రైవర్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌‌కు వచ్చి పనిచేస్తున్న వారు సుమారు 15 వేల మంది ఉన్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. గ్రీన్‌‌ ఎస్‌‌ఎం రాకతో వీరందరి ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఓలా, ఉబెర్‌‌ డ్రైవర్లు తమకు నచ్చినప్పుడు యాప్‌‌లో లాగిన్‌‌, లాగౌట్‌‌ అయ్యే స్వేచ్ఛ కలిగి ఉన్నారు. కానీ గ్రీన్‌‌ ఎస్‌‌ఎంలో మాత్రం కార్పొరేట్‌‌ ఉద్యోగుల తరహాలో నిర్ణీత పని గంటలు, కంపెనీ నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌‌లో ఎన్ని వాహనాలకు అనుమతులు ఇస్తారు? ఎంతమంది డ్రైవర్లను నియమిస్తారు? ఛార్జీలు ఎలా నిర్ణయిస్తారు? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

డ్రైవర్లకు కఠిన నిబంధనలు!
గ్రీన్‌‌ ఎస్‌‌ఎం క్యాబ్స్‌‌ రాకతో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ఢిల్లీలో మాదిరిగా తొలి విడతలో 1000 కార్లు ప్రవేశపెడితే ఒక్కో కారుకు ఒకటి లేదా రెండు షిఫ్టుల చొప్పున సుమారు వెయ్యి నుంచి 2 వేల మంది డ్రైవర్లు అవసరమవుతారని అంచనా. సంస్థ సొంతంగా డ్రైవర్లను నియమించుకోనుంది. రోజుకు 12 గంటలు పనిచేస్తే నెలకు రూ.35 వేల జీతం ఇస్తున్నట్లు ఢిల్లీ కార్యకలాపాలకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈ ఆదాయం పొందేందుకు డ్రైవర్లకు కొన్ని నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. 90 శాతం రైడ్లను అంగీకరించడంతో పాటు వాటిని పూర్తి చేయాలి. కస్టమర్ల నుంచి 4.8 రేటింగ్‌‌ సాధించాలి. బుక్‌‌ చేసిన రైడ్‌‌ను డ్రైవర్లు మధ్యలో రద్దు చేయడానికి వీల్లేదని చెబుతున్నారు.

ఢిల్లీలోని డ్రైవర్లు ఈ నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్‌‌ ఎక్కువగా ఉన్నా, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, 10 నుంచి 12 గంటల పాటు డ్రైవింగ్‌‌ చేయడం అలసటకు గురిచేస్తోందని చెబుతున్నారు. ఛార్జింగ్‌‌ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. ఆదాయ హామీ, చెల్లింపుల విషయంలోనూ కొందరు డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.