హైదరాబాద్/ కొడంగల్, వెలుగు: కొడంగల్లో ఈ నెల 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహించనున్నారు.
నవంబర్ 7న సీఎం రేవంత్రెడ్డి మేళాను ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మేళాలో 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో 150 ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, సాగు పరికరాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలను ప్రదర్శించనున్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సాంకేతిక సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలు, మార్కెటింగ్ అవకాశాలు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించనున్నారు. మొదటి రోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి సుమారు 7,500 మంది రైతులు హాజరుకానుండగా, చివరి రోజు 10 జిల్లాల నుంచి 50 వేల మంది పాల్గొంటారని అంచనా. రెండో రోజు మహిళా రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు, సీఎం రేవంత్రెడ్డి 7, 8, 9 తేదీల్లో కొడంగల్లో పర్యటించనున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
రైతు మేళా, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ జరిగే ప్రాంతాలను ఎస్పీ స్నేహ మెహ్రా పరిశీలించి, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పోలీసుల విధులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యటన విజయవంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
