E20 పెట్రోల్ మాదిరిగా విమానాల్లోనూ గ్రీన్ ఆయిల్: మోడీ సర్కార్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

E20 పెట్రోల్ మాదిరిగా విమానాల్లోనూ గ్రీన్ ఆయిల్: మోడీ సర్కార్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

భారత విమానయాన రంగంలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విమానాల్లో వాడే ఇంధనం విషయంలో మోడీ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోంది. 2040 నాటికి విమానయానంలో రాబోతున్న కీలక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

సెస్ & గ్రీన్ ఇంధనం(SAF) అంటే ఏమిటి?
సాధారణంగా విమానాల్లో 'ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్'(ATF) అనే ప్రత్యేక ఇంధనాన్ని వాడతారు. దీనివల్ల భారీగా కాలుష్యం వెలువడుతుంది. దీన్ని తగ్గించేందుకు వ్యవసాయ వ్యర్థాలు, వాడిన వంట నూనెలు, మున్సిపల్ చెత్త నుంచి తయారు చేసే 'సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్' (SAF) అనే గ్రీన్ ఇంధనాన్ని వాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పుడు దేశంలో పెట్రోల్ వాహనాల్లో ఇథనాల్ కలిపి ఈ20 పెట్రోల్ మాదిరిగా గాల్లో ఎగిరే విమానాల్లో కూడా వ్యర్థాలను ప్రాసెస్ చేసి ఇంధనాన్ని తయారు చేసి కలుపుతారు అన్నమాట. ఇది ప్రస్తుతం రెగ్యులర్‌గా వాడుతున్న విమాన ఇంధనంలో కలిపి వాడనున్నారు.

2027 నుంచి కొత్త రూల్స్.. 40% టార్గెట్
భారత విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ముసాయిదా విధానం ప్రకారం.. 2027 నుంచి దేశంలో నడిచే విమానాల్లో ఈ గ్రీన్ ఇంధనాన్ని తప్పనిసరిగా కలపాల్సి ఉంటుంది.
* మొదటి దశ (2027 - 2030): ఈ గ్రీన్ ఫ్యూయెల్ మిక్సింగ్ ప్రారంభంలో 1 శాతంతో మొదలుపెట్టి, క్రమంగా దీన్ని 5 శాతానికి పెంచుతారు.

* రెండో దశ (2031 - 2040): ఇక రెండో దశలో 2040 నాటికి ఈ మిక్సింగ్ శాతాన్ని ఏకంగా 40 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

90 శాతం మన దేశంలోనే:
విమాన సర్వీసులు నడిపే కంపెనీలు విదేశాల నుంచి ఇంధనం నింపుకురాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఒక కఠిన నిబంధన తెచ్చింది. అంతర్జాతీయ విమానాలు నడిపే ఏ సంస్థ అయినా.. తమకు ఏడాదిలో కావాల్సిన ఇంధనంలో కనీసం 90 శాతాన్ని భారత్‌లోని విమానాశ్రయాల నుంచే కొనుక్కుని నింపుకోవాలని స్పష్టం చేసింది మోడీ ప్రభుత్వం.

►ALSO READ | ఈ 5 దేశాల్లో ఉద్యోగులను తీసేస్తున్న గూగుల్: రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ ఆఫర్స్

ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు.. 
మన దేశంలోనే ఈ గ్రీన్ ఇంధనం తయారీని పెంచేందుకు ప్రభుత్వం పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపులు, గ్రీన్ ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా 'SAF ఇన్నోవేషన్ ఫండ్'ను కూడా ఏర్పాటు చేయనున్నారు. 2040 నాటికి భారత్ ఏడాదికి సుమారు కోటి టన్నుల గ్రీన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలదని, ఇందుకు 70 నుంచి 85 బిలియన్ డాల్టర్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

మెుత్తానికి ఎగిరే విమానాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం తెస్తున్న కొత్త ఇంధన పాలసీ మంచిదే అయినప్పటికీ ప్రయాణికులకు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ20 వాహనాల్లో మాదిరిగా విమానాల ఇంజన్లలో కూడా సమస్యలు వస్తే గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు పరిస్థితి ఏంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమానాల్లో గ్రీన్ ఫ్యూయెల్ కలపటం ఎంత వరకూ సేఫ్ అనే దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.