హైదరాబాద్ లో మహిళలు, పేదలే టార్గెట్‌గా అక్రమ ఫైనాన్స్ దందా...

హైదరాబాద్ లో మహిళలు, పేదలే టార్గెట్‌గా అక్రమ ఫైనాన్స్ దందా...

హైదరాబాద్ లో అక్రమ ఫైనాన్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఎల్బీ నగర్ లో మహిళలు, పేదలే టార్గెట్ గా అక్రమ ఫైనాన్స్ దందా నడుపుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. గురువారం ( నవంబర్ 5 ) అక్రమ ఫైనాన్సింగ్ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మల్కాజిగిరి కమిషనర్ సుమతి.ఫైనాన్స్ పేరుతో కొంతమంది మహిళలు, ఆర్థికంగా వెనకబడినవారి నుంచి భారీగా వసూళ్లు రాబడుతున్నారని.. డబ్బులు ఇవ్వకపోతే బెదిరించడం, కొట్టడం చేస్తున్నారని అన్నారు సీపీ సుమతి. అక్రమ ఫైనాన్స్ దందా చేస్తున్న ముఠాను అరెస్ట్ చెసి.. నిందితుల దగ్గరి  నుంచి ప్రామిసరీ నోట్లు, రెండు కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అక్రమ ఫైనాన్స్ దందాకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ముఠాలో నలుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు సీపీ సుమతి. నిందితులపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశామని అన్నారు. అధిక వడ్డీలు వసూలు చేయడం నేరమని..ఇలాంటి దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీపీ సుమతి.