దీపావళికి మట్టి ప్రమిదలు కొంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

దీపావళికి మట్టి  ప్రమిదలు కొంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

దీపావళి పండుగ వచ్చిందంటే హిందువులు ప్రమిదలు కొంటారు.  ప్రస్తుతం మార్కెట్లో రంగు రంగుల ప్రమిదలు  అనేక డిజైన్లలో లభిస్తున్నాయి.. అయితే దీపావళి పండుగకు దీపాలు వెలిగించేందుకు మట్టి ప్రమిదను కొనే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు.  ఇప్పడు వాటి గురించి తెలుసుకుందాం. . .!

 దీపావళి పండుగ సమయంలో పూజ కోసం, ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి మట్టి దీపాలను కొనుగోలు చేస్తుంటారు.  చూడటానికి అందంగా ఉన్న ప్రతి దీపం నాణ్యమైనది కాదు. నాణ్యత లేని దీపాలను ఉపయోగించడం వల్ల నూనె కారడం, దీపం ఒరిగిపోవడం, వెలిగించినప్పుడు పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే దీపాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి.

పగుళ్లు ఉన్నాయో లేదో చూడండి: మట్టి ప్రమిదను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి.  ఎగుడు దిగుడు గా ఉండకూడదు.  ప్రమిద అంచూ రౌండ్​ గా సమానంగా ఉండాలి. ఎక్కడైనా చిన్న పగుళ్లు, విరిగిన భాగాలు లేదా దెబ్బతిన్న అంచులు ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించాలి.  ఎంత జాగ్రత్తగా చూసినా  కొన్ని పగుళ్లు పైకి కనిపించవు. అలాంటి దీపాల్లో నూనె పోసినప్పుడు కారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రమిదను చేతిలోకి తీసుకుని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలి.

అడుగుభాగం చదునుగా ఉండాలి:  దీపం అడుగు భాగం  సమంగా ఉండాలి.  లేకపోతే నేలపై కాని పూజా మందిరంలో స్థిరంగా ఉండదు. దీపం అడుగుభాగం సమంగా, చదునుగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే నేలపై లేదా పూజా మందిరంలో ఉంచినప్పుడు అది స్థిరంగా ఉంటుంది.  అడుగుభాగం వంకరగా ఉంటే దీపం ఊగడం, ఒరిగిపోవడం, కిందపడటం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా వెలిగించిన దీపాలు కిందపడకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకోవాలి.

సరిగ్గా కాల్చిన మట్టి దీపాలు: మట్టి ప్రమిదలు తయారు చేసిన తర్వాత వాటిని సరిగ్గా కాల్చారా లేదా అనేది గమనించాలి. సరిగా కాల్చిన ప్రమిదలు గట్టిగా ఉంటాయి. సరిగా కాల్చని దీపాలు పెళుసుగా ఉండి చిన్న దెబ్బకే విరిగిపోవచ్చు. చేతితో పట్టుకున్నప్పుడు మట్టి పొడిపొడిగా రాలుతున్నా, దీపం బలహీనంగా అనిపించినా వాటిని కొనకపోవడం మంచిది.

అధిక రంగులు, మెరుపులు ఉన్నవి వద్దు:మార్కెట్ లో ఆకర్షణీయమైన రంగులు, మెరిసే పూతలతో కూడిన దీపాలు కనిపిస్తుంటాయి. అయితే నూనె లేదా నెయ్యి పోసి వెలిగించే ప్రమిదల లోపలి భాగంలో రంగులు, మెరుపు పూతలు లేకుండా ఉండటం మంచిది. వీలైనంత వరకు సహజమైన, రంగులు వేయని మట్టి ప్రమిదలను ఎంచుకోవాలి.

నీటిని పీల్చుకునే గుణాన్ని పరిశీలించండి: మట్టి ప్రమిద నాణ్యతను తెలుసుకోవడానికి నీటితో ఒక చిన్న పరీక్ష చేయవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ప్రమిదను కొద్దిసేపు అందులో ఉంచండి. అది అధికంగా నీటిని పీల్చుకుంటుందేమో గమనించండి .దీపావళికి మట్టి ప్రమిదలు కొనేటప్పుడు కేవలం అందానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, మట్టి ప్రమిదలకు ఇంపార్టెన్స్​ ఇవ్వండి.