డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మన అకౌంట్లోని డబ్బును కొల్లగొట్టడానికి కేవలం ఒక్క రూపాయి సరిపోతుందంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. AI సాంకేతికతను ఉపయోగిస్తూ సైబర్ దొంగలు చేస్తున్న సరికొత్త మోసం గురించిన వివరాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ 'CERT-In' తాజాగా దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ సరికొత్త సైబర్ దాడిని గుర్తించింది. 'క్రాఫ్టీ ఫాల్కన్' పేరుతో సాగుతున్న ఈ క్రిమినల్ క్యాంపెయిన్ చాలా ప్రమాదకరమైనదని.. ఇది ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతోందని హెచ్చరిక జారీ చేసింది.
ఇందులో సైబర్ నేరగాళ్లు ఆర్టెక్స్, పెంటాజీ వంటి అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వాడుతున్నారు. ఈ టూల్స్ ద్వారా దొంగలు తమ దాడులను ఆటోమేట్ చేస్తూ.. క్షణాల వ్యవధిలో బ్యాంకింగ్ సిస్టమ్స్‌లోని బలహీనతలను గుర్తిస్తున్నారు. క్లౌడ్ సేవలు, ఎక్స్పోజ్ అయిన టెస్టింగ్ సర్వర్ల ద్వారా నేరుగా ఫైనాన్షియల్ సిస్టమ్స్‌లోకి చొరబడి దాడులకు తెగబడుతున్నారు.
ముఖ్యంగా ఈ మోసంలో 'రూపాయి' ట్రిక్ ప్రధాన ఆయుధంగా మారుతోంది. నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును కాజేయడానికి ముందు.. సిస్టమ్ ఎలా స్పందిస్తుందో చెక్ చేయడానికి కేవలం ఒక రూపాయి చొప్పున మైక్రో-ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఈ చిన్న టెస్ట్ పేమెంట్ విజయవంతం కాగానే.. ఎలాంటి అలర్ట్ రాకుండా క్షణాల్లోనే అకౌంట్లోని పెద్ద మొత్తాన్ని పూర్తిగా ఖాళీ చేసేస్తున్నారు.
ఈ ప్రమాదం నుండి రక్షించుకోవడానికి ఫైనాన్షియల్ సంస్థలు 24 గంటలూ నిఘా ఉంచాలని CERT-In హెచ్చరించింది. కొత్త లబ్ధిదారులకు వెళ్లే రూపాయి టెస్ట్ పేమెంట్లను వెంటనే గుర్తించడం, కొత్త పేమెంట్లకు కూలింగ్ పీరియడ్స్ పెట్టడం వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది. వినియోగదారులు కూడా ప్రతి చిన్న లావాదేవీ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వాడి భారీ సొమ్మును కాజేసేందుకు నేరగాళ్లు జస్ట్ ఒక్క రూపాయిని ఎరగా పంపిస్తున్నారన్నమాట.
