OTT Crime Thriller: ఒక్కో ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. జియోహాట్‌స్టార్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

OTT Crime Thriller: ఒక్కో ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. జియోహాట్‌స్టార్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

క్రైమ్ థ్రిల్లర్లు చాలానే చూసుంటాం. హత్యలు, హంతకులు, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఊహించని మలుపులు.. ఇలా ఎన్నో సినిమాలు చూసి ఉంటాం. కానీ ఒక హత్యకు ప్రత్యక్ష సాక్షిగా మారిన వ్యక్తి నిజంగా ఏం చూశాడు? అతడు చెప్పేది నిజమా? అబద్ధమా? అసలు అతడి కళ్లకు కనిపించనిది ఏమిటి? అనే ప్రశ్నలతో ప్రేక్షకుల మెదడుకు పదునుపెట్టే సినిమా మాత్రం అరుదుగా వస్తుంటుంది. అలాంటి అరుదైన సినిమానే ఆయుష్మాన్ ఖురానా, టబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ 'అంధాధున్' (Andhadhun). 2018లో రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో థ్రిల్లర్ ఆడియన్స్ ఈ సినిమాకు అట్ట్రాక్ట్ అవుతున్నారు. మరి ఈ సినిమా స్టోరీ ఏంటీ? అసలు ఇందులో అంతగా ఆకట్టుకునే అంశాలేంటి? అనేది ఓ లుక్కేద్దాం..

కథేంటి?

ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ అద్భుతమైన పియానో ప్లేయర్. సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. అయితే అతడికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకాశ్ తనను తాను అంధుడిగా పరిచయం చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఈ క్రమంలో సోఫీ (రాధికా ఆప్టే) పరిచయం అతడి జీవితంలోకి వస్తుంది. ఆమె ద్వారా ఓ రెస్టారెంట్‌లో పియానో ప్లే చేసే అవకాశం దక్కుతుంది. అక్కడే ఒకప్పటి ప్రముఖ నటుడు ప్రమోద్ సిన్హా (అనిల్ ధావన్) పరిచయమవుతాడు. తన భార్య సిమి (టబు) కోసం ఇంట్లో ప్రత్యేకంగా పియానో ప్రదర్శన ఇవ్వాలని ఆకాశ్‌ను ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆకాశ్‌కు ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఓ హత్య.. దాని వెనుక దాగున్న రహస్యాలు.. వాటిని కప్పిపుచ్చేందుకు జరిగే ప్రయత్నాలు.. వీటి మధ్యలో చిక్కుకున్న ఆకాశ్ జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. అసలు ఆ హత్యకు ఎవరు కారణం? ఆకాశ్ నిజంగానే అంధుడా? అతడికి తెలిసిన నిజాలేంటి? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కథనం, స్క్రీన్‌ప్లే ఎలా ఉన్నాయి?

ఒక్కో ట్విస్ట్‌తో అంచనాలను తలకిందులు చేసే స్క్రీన్‌ప్లే 'అంధాధున్' ప్రధాన బలం. ఎవరి మాట నమ్మాలో, ఏది నిజమో అర్థంకాని పరిస్థితులతో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించాడు. సస్పెన్స్‌కు బ్లాక్ కామెడీని జోడించి కథనాన్ని మరింత ఆసక్తికరంగా మలిచాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఊహించని మలుపులు, క్లైమాక్స్ ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యే అనుభూతిని ఇస్తాయి.

►ALSO READ | విడుదలైన నెల రోజుల్లోపే OTTలోకి జైలర్-2.. రిలీజ్ డేట్ చెప్పేసిన అమెజాన్ ప్రైమ్ !

నటీనటుల పెర్ఫార్మెన్స్

ఆకాశ్ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా చాలా సహజంగా నటించాడు. ఒకవైపు అమాయకత్వం, మరోవైపు పరిస్థితులకు అనుగుణంగా మారే అతడి ప్రవర్తనను అద్భుతంగా పలికించాడు. ఇక ఈ సినిమాలో అందరినీ మించి నిలిచే నటన టబుది. సిమి పాత్రలో ఆమె చూపించిన వైవిధ్యం, ముఖంలో పలికించే భావాలు, పాత్రలోని క్రూరత్వం, తెలివితేటలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆమె కనిపించే ప్రతి సీన్ కథపై ఆసక్తిని మరింత పెంచుతుంది. రాధికా ఆప్టే తన పాత్రకు న్యాయం చేసింది. 

టెక్నికల్ అంశాలు

దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకు వెన్నెముకగా నిలుస్తుంది. ప్రతి సన్నివేశాన్ని కథకు ఉపయోగపడేలా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అమిత్ త్రివేది సంగీతం, డేనియల్ బి. జార్జ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను మరింత పెంచుతాయి. ఇకపోతే ఈ మూవీని తెలుగులో నితిన్ హీరోగా మేస్ట్రో అని రీమేక్ చేశారు.