ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 5వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. అన్ని గ్రామాల్లోనూ ఓట్లు వేయటానికి పోలింగ్ బూతులకు ఓటర్లు వెళుతుంటే.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఓ గ్రామం మాత్రం పోలింగ్‌ను బహిష్కరించింది.
ఐరాల మండలం అబ్బుగుండు అనే గ్రామంలోని ఓటర్లు అందరూ పోలింగ్ బహిష్కరించారు. గ్రామంలో ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసినా.. ఎవరూ ఓటు వేయటానికి వెళ్లలేదు. ‘‘మేం ఓట్లు వేయం’’ అని గ్రామం మొత్తం పోలింగ్‌ను బహిష్కరించింది. గ్రామానికి రోడ్డు లేదని.. కొన్ని సంవత్సరాలుగా రోడ్డు కోసం ఎమ్మెల్యే, అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా గ్రామంలో మంచినీటి ఇబ్బందులు ఉన్నాయని.. మంచి నీటి సమస్య పరిష్కారానికి కొన్నేళ్లుగా వినతి పత్రాలు ఇస్తున్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు గ్రామంలోని మహిళలు. గ్రామంలోని రోడ్లు కూడా బాగాలేవని.. గ్రామానికి వచ్చే రోడ్డు దారుణంగా ఉందని.. యాక్సిడెంట్లు అయ్యి గ్రామంలోని వ్యక్తులు ప్రమాదాల బారిన పడుతున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గ్రామం మొత్తం ఒక్కటి అయ్యి.. ఒకే మాటగా పోలింగ్ ను బహిష్కరిస్తున్నాం అని.. గ్రామంలో 200 ఓట్లు ఉన్నాయని.. ఎవరూ ఓటు వేయం అంటూ పోలింగ్ కోసం వచ్చిన సిబ్బందికి స్పష్టం చేశారు గ్రామస్తులు. కొన్నేళ్లుగా కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధికి.. ప్రతి అధికారికి మా ఆవేదన చెబుతూనే ఉన్నాం అని.. ఎవరూ ఇప్పటి వరకు పరిష్కరించే ఆలోచన చేయలేదని.. ఈ క్రమంలోనే పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు స్పష్టం చేశారు.
