Ramayana Part 1 Review: భారీ అంచనాలను అందుకుందా? సినిమా ఎలా ఉందంటే?

Ramayana Part 1 Review: భారీ అంచనాలను అందుకుందా? సినిమా ఎలా ఉందంటే?

భారతీయులందరికీ సుపరిచితమైన రామాయణ (Ramayan) కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు నితేశ్ తివారీ. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించిన ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 5, 2026న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు నితేశ్ తివారీ ఈసారి కేవలం రాముడి కథనే కాకుండా, రావణుడి ఎదుగుదల, అతడి సామ్రాజ్యం, అధికార దాహం, అహంకారాన్ని కూడా సమాంతరంగా చూపించే ప్రయత్నం చేశారు. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? రణబీర్ రాముడిగా మెప్పించారా? యష్ రావణుడిగా అదరగొట్టారా? సినిమా కథ ఎలా సాగింది? అనేది ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం..

రావణుడి తపస్సుతో మొదలయ్యే కథ..

సినిమా స్టార్టింగే రావణుడి పాత్రతో ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. సాధారణ రాక్షసుడిగా కాకుండా అపారమైన జ్ఞానం, పరాక్రమం, శివభక్తి కలిగిన వ్యక్తిగా రావణుడిని పరిచయం చేస్తారు. తన శక్తిని పెంచుకోవడం కోసం బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు కఠోర తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వరాలు ప్రసాదిస్తాడు. ఆ వరాలతో రావణుడి బలం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత కుబేరుడి ఆధీనంలో ఉన్న లంకపై కన్నేస్తాడు. యుద్ధంలో కుబేరుడిని ఓడించి స్వర్ణలంకను స్వాధీనం చేసుకుంటాడు. అలా లంకకు చక్రవర్తిగా ఎదుగుతాడు. ఇక్కడ రావణుడి పాత్రను దర్శకుడు ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ప్రజలకు సంపద, అధికారం అందించే రాజుగా ఒకవైపు కనిపిస్తూనే, మరోవైపు తన మాటకు ఎదురు చెప్పేవారిని సహించని అహంకారిగా మారతాడు. యష్ తన శరీర భాష, గంభీరమైన హావభావాలతో రావణుడి పాత్రకు రాజసాన్ని తీసుకొచ్చారు.

మరోవైపు విష్ణుమూర్తి రాముడిగా అవతారం..

లంకలో రావణుడి సామ్రాజ్యం విస్తరిస్తుంటే, మరోవైపు భూలోకంలో అధర్మాన్ని అంతం చేసేందుకు శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరిస్తాడు. అయోధ్య రాజు దశరథుడు (అరుణ్ గోవిల్), కౌసల్య (ఇందిరా కృష్ణన్) దంపతులకు రాముడు జన్మిస్తాడు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపిస్తారు. చిన్నప్పటి నుంచే రాముడిలో కనిపించే ధర్మనిష్ఠ, వినయం, పెద్దల పట్ల గౌరవం, సోదరులపై ప్రేమను కథలో చూపిస్తారు. లక్ష్మణుడు (రవి దూబే), భరతుడు, శత్రుఘ్నులతో రాముడి అనుబంధం కూడా పరిచయమవుతుంది. విశ్వామిత్ర మహర్షి వద్ద అస్త్రవిద్యలు నేర్చుకోవడం, రాక్షసులను సంహరించడం వంటి ఘట్టాల ద్వారా రాముడి పరాక్రమాన్ని చూపిస్తారు.

సీతా స్వయంవరం..

మిథిలా రాజు జనకుడి కుమార్తె సీత (సాయి పల్లవి) స్వయంవరానికి సంబంధించిన ఘట్టం కథలో మరో ముఖ్యమైన మలుపు. శివధనుస్సును ఎత్తి విరిచినవారికే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని జనకుడు నిర్ణయిస్తాడు. ఎంతోమంది రాజులు ప్రయత్నించినా సాధ్యం కాదు. చివరకు రాముడు ఆ ధనుస్సును విరిచి సీతను వివాహం చేసుకుంటాడు. సీతారాముల అనుబంధాన్ని సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సాయి పల్లవి తన సహజమైన నటనతో సీత పాత్రకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చారు.

రాముడి పట్టాభిషేకానికి అడ్డుపడిన మంథర..

రాముడి పట్టాభిషేకానికి దశరథుడు ఏర్పాట్లు చేస్తుండగా, కైకేయి దాసి మంథర (షీబా చద్దా).. కైకేయి మనసులో అనుమానాలు, అసూయను నింపుతుంది. గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను గుర్తుచేసి, భరతుడికి పట్టాభిషేకం చేయాలని, రాముడిని 14 ఏళ్లు అరణ్యవాసానికి పంపాలని కోరేలా చేస్తుంది. తండ్రి మాటకు కట్టుబడిన రాముడు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అడవులకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. సీత, లక్ష్మణుడు కూడా ఆయన వెంట బయలుదేరుతారు. ఈ ఘట్టాల్లో రాముడి త్యాగం, సీత ప్రేమ, లక్ష్మణుడి అంకితభావం ఆకట్టుకుంటాయి. మరోవైపు దశరథుడి వేదన భావోద్వేగానికి గురిచేస్తుంది.

విద్యుజ్జిహ్వుడితో రావణుడి భీకర పోరాటం..

ఇక రావణుడి ప్రపంచంలో మరో ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంటుంది. శూర్పణఖ (రకుల్ ప్రీతీ సింగ్) భర్త విద్యుజ్జిహ్వుడి పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపిస్తారు. అతడితో రావణుడికి జరిగే ఘర్షణ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక సందర్భంలో విద్యుజ్జిహ్వుడు ఒక సేవకురాలిని అవమానించగా, రావణుడు ఆమెను గౌరవంగా పైకి లేపడం ద్వారా తనలోని మరో కోణాన్ని చూపిస్తాడు. అయితే ఆ తర్వాత రావణుడికి, విద్యుజ్జిహ్వుడికి మధ్య జరిగే ఘర్షణ తీవ్రరూపం దాల్చుతుంది. రావణుడి చేతిలో విద్యుజ్జిహ్వుడి మరణిస్తాడు.

శూర్పణఖ ప్రవేశం.. సీతపై కన్నేసిన రావణుడు..

అరణ్యవాసంలో ఉన్న రాముడు, సీత, లక్ష్మణుల దగ్గరకు రావణుడి సోదరి శూర్పణఖ (రకుల్ ప్రీత్ సింగ్) వస్తుంది. రాముడి అందానికి ఆకర్షితురాలై తనను పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. కానీ సీత తన భార్య అని,  నా మనసు సీతకే అంకితం అని రాముడు స్పష్టం చేస్తాడు. దీంతో ఆమె సీత ( సాయి పల్లవి)లాగా మారువేషంలో రాముడి దగ్గరకు వెళ్తుంది. ఇది గమనించిన లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులను కోసి శిక్షిస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేని శూర్పణఖ తన అన్న రావణుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరిస్తుంది. సీత అందం గురించి చెప్పి, ఆమెను రావణుడు పొందాలనే కోరికను రగిలిస్తుంది. ఇక్కడి నుంచే రాముడు, రావణుడి మధ్య ప్రత్యక్ష ఘర్షణకు పునాది పడుతుంది.

బంగారు జింక మాయ.. సీతను ఒంటరిగా చేసిన మారీచుడు..

సీతను అపహరించేందుకు రావణుడు మారీచుడి సహాయం తీసుకుంటాడు. మారీచుడు బంగారు జింక రూపంలో ఆశ్రమం దగ్గరకు రావడంతో, దాని అందానికి ఆకర్షితురాలైన సీత రాముడిని దానిని తీసుకురమ్మని కోరుతుంది. దీంతో రాముడు జింక వెంట అడవిలోకి వెళ్తాడు. చివరకు మారీచుడు రాముడి గొంతును అనుకరిస్తూ ఆర్తనాదాలు చేయడంతో సీత ఆందోళన చెందుతుంది. లక్ష్మణుడిని రాముడి దగ్గరకు వెళ్లమని పట్టుబడుతుంది. మొదట నిరాకరించిన లక్ష్మణుడు, సీత భావోద్వేగానికి గురై మాట్లాడిన మాటలతో మనస్తాపం చెంది చివరకు ఆశ్రమం విడిచి వెళ్తాడు. దీంతో రావణుడి కుట్రకు మార్గం సుగమమవుతుంది.

బిచ్చగాడి వేషంలో రావణుడు.. సీతాపహరణం..

రాముడు, లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు భిక్ష అడుగుతూ సీతను మోసం చేస్తాడు. తన అసలు రూపాన్ని బయటపెట్టి ఆమెను బలవంతంగా పుష్పక విమానంలో లంకకు అపహరించుకుపోతాడు. ఈ సన్నివేశంలో రావణుడిని ధైర్యంగా ఎదిరించే సీతగా సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంది. అయితే, సినిమాలో సీతాదేవి పాత్ర యాక్షన్ సీన్స్ (ఫైట్స్) చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసేలా ఉంది. ఎందుకంటే సీతమ్మ వారు ఎంతో శాంత స్వరూపిణి, ఆమె ఎప్పుడైనా యుద్ధం చేసినట్లు ఉండటం ఏ రామాయణంలోనైనా కూడా ఉండదనే ఫీలింగ్ చూసే ఆడియన్స్ కు కలుగుతుంది. 

రావణుడు vs జటాయువు.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధం..

సీతను లంకకు తీసుకెళ్తున్న రావణుడిని మార్గమధ్యంలో జటాయువు అడ్డుకుంటుంది. దశరథుడి స్నేహితుడైన జటాయువు, వయసు మీదపడినా రావణుడి శక్తికి భయపడకుండా సీతను రక్షించేందుకు పోరాడుతుంది. పుష్పక విమానంలో సాగుతున్న ఈ పోరాటం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. రావణుడి దాడులకు జటాయువు తీవ్రంగా గాయపడి రెక్కలు కోల్పోయినా, సీతను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ప్రేక్షకులను కదిలిస్తుంది. అనుపమ్ ఖేర్ గాత్రం ఈ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ యాక్షన్ ఘట్టం సినిమా క్లైమాక్స్ కు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 

అలా సీతను రావణుడు లంకకు అపహరించుకెళ్లడంతో మొదటి భాగం కీలకమైన మలుపు దగ్గర ముగుస్తుంది. భార్యను కోల్పోయిన రాముడు.. సీతను బంధించిన రావణుడు.. ఇక వీరిద్దరి మధ్య యుద్ధం తప్పదనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో కలిగిస్తూ కథ ముగుస్తుంది. రెండో భాగంలో హనుమంతుడి ప్రవేశం, సీతాన్వేషణ, లంకాదహనం, వానరసేన సమీకరణ, సముద్రంపై వారధి నిర్మాణం, రామరావణ యుద్ధం వంటి కీలక ఘట్టాలు ఉండనున్నాయి. దీంతో సెకండ్ పార్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నటీనటుల పెర్ఫార్మన్స్..

రణబీర్ కపూర్ రాముడిగా ప్రశాంతత, సంయమనంతో ఆకట్టుకున్నప్పటికీ భావోద్వేగాల్లో కొంత తక్కువగా అనిపించారు. అలాగే, పరుశురాముడిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సీతగా సాయి పల్లవి తన సహజ నటనతో మెప్పించినప్పటికీ.. ఎమోషన్స్ పండించడంలో తడబడినట్లుగా అనిపిస్తుంది. యష్ రావణుడిగా రాజసం, అహంకారం, పరాక్రమాన్ని అద్భుతంగా ప్రదర్శించి సినిమాకు స్పెషల్ అట్ట్రాక్షన్ గా నిలిచారు. రవి దూబే అన్నమాట జవదాటని లక్ష్మణుడిగా ఆకట్టుకున్నారు. అలాగే, అదిరిపోయే సెటైరికల్ డైలాగ్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా తమ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగతా పాత్రలకు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. 

►ALSO READ | రావణుడిగా యశ్ విధ్వంసం.. ‘రామాయణం’ రిజల్ట్‌పై ఆడియన్స్ ఏమంటున్నారంటే?

టెక్నీకల్గా ఎలా ఉంది..

టెక్నీకల్గా సినిమా భారీ స్థాయిలో తెరకెక్కింది. అయోధ్య, లంక, అడవుల విజువల్స్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, జటాయువు పోరాటం ఆకట్టుకుంటాయి. ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆకట్టుకునే విధంగా ఉండాల్సింది. అయితే కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ కృత్రిమంగా అనిపించడం కూడా సినిమా స్థాయిని తగ్గించింది. ఓవరాల్ గా రామాయణాన్ని వెండితెరపై గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నంగా పార్ట్ 1 నిలుస్తుంది.