Virat Kohli: ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా, భారత్ ది బెస్ట్ టెస్ట్ కెప్టెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈరోజు (గురువారం, నవంబర్ 5, 2026) తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. కాగా, 2008లో క్రికెట్ అరంగేట్రం చేసిన కింగ్, తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో 566 మ్యాచ్‌ల్లో ఏకంగా 86 సెంచరీలతో 28,601 రన్స్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
2011 వన్డే ప్రపంచకప్, 2013, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు, 2024 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న భారత జట్టులో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 74 పరుగుల విన్నింగ్ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించిన కింగ్ కోహ్లీ.. తన కెరీర్‌లో సాధించిన మైండ్ బ్లాకింగ్ వరల్డ్ రికార్డుల జాబితా ఇదే..
వన్డే క్రికెట్ మహారాజు:
* 55 వన్డే సెంచరీలు: వన్డే చరిత్రలో 50, 55 సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే ఏకైక బ్యాటర్ విరాట్ కోహ్లీ.
* ఫాస్టెస్ట్ మైలురాళ్లు: వన్డేల్లో అతివేగంగా 8,000 నుంచి 15,000 రన్స్ (8k, 9k, 10k, 11k, 12k, 13k, 14k, 15k) మైలురాళ్లను అందుకున్న రికార్డు కోహ్లీదే.
* అత్యధిక సగటు: 100 కంటే ఎక్కువ వన్డేలు ఆడిన ప్లేయర్లలో 58.84 సగటుతో విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు.
* ఛేజింగ్ రికార్డులు: వన్డే ఛేజింగ్‌లలో అత్యధిక పరుగులు (8,741), అత్యధిక సెంచరీలు (30) సాధించడమే కాక, కనీసం 25 ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో 66.21 అత్యున్నత సగటు కలిగి ఉన్నాడు.
* వరల్డ్ కప్ రికార్డులు: వరల్డ్ కప్ అరంగేట్రంలోనే సెంచరీ (100* vs బంగ్లాదేశ్, 2011) చేసిన ఏకైక భారతీయుడు. 2023 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 765 రన్స్ చేసిన రికార్డు సృష్టించాడు.
* ఫాస్టెస్ట్ ఇండియన్ సెంచరీ: 2013లో ఆస్ట్రేలియాపై జైపూర్‌లో కేవలం 52 బంతుల్లోనే వన్డే సెంచరీ కొట్టాడు.
* వరుస సెంచరీలు, ఫిఫ్టీలు: వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు అత్యధికంగా 11 సార్లు చేశాడు. అంతేకాకుండా వరుసగా 5 మ్యాచ్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు అత్యధికంగా ఐదుసార్లు నమోదు చేసిన ఏకైక బ్యాటర్.
* ప్రతి 5.56 ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ: కనీసం 10 సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ప్రతి 5.56 ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ సాధిస్తూ అత్యుత్తమ రేషియో కలిగి ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్ రికార్డులు:
* అత్యధిక సగటు: 25 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన అంతర్జాతీయ టీ20 బ్యాటర్లలో 48.71 అత్యధిక సగటు కోహ్లీదే.
* వేగవంతమైన 4 వేల రన్స్: టీ20లలో అత్యంత వేగంగా (107 ఇన్నింగ్స్‌లలో) 4,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ రికార్డు.
* తొలి బంతికే వికెట్: 2011లో ఇంగ్లాండ్‌పై వేసిన తన మొదటి అంతర్జాతీయ టీ20 బంతికే కేవిన్ పీటర్సన్‌ను స్టంపౌట్ చేశాడు.
* టీ20 వరల్డ్ కప్స్: టీ20 ప్రపంచకప్‌లలో అత్యధికంగా 1,292 పరుగులు (33 ఇన్నింగ్స్‌లలో) సాధించాడు. భారత్ తరఫున ఓవరాల్ టీ20లలో 14,218 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.
* ఐపీఎల్ (IPL) రికార్డులు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (9,336 పరుగులు), అత్యధిక సెంచరీలు (9 సెంచరీలు) బాదిన ప్లేయర్. 2016 ఐపీఎల్ సీజన్లో ఒకే టోర్నీలో ఏకంగా 973 రన్స్ సాధించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒకే గ్రౌండ్‌లో 3,864 పరుగులు చేసిన అరుదైన రికార్డ్ సాధించాడు.
►ALSO READ | బ్యాట్‌తో రికార్డులు.. యాడ్స్‌తో కోట్ల ఆదాయం.. ఇదీ కోహ్లీ బ్రాండ్ పవర్!
భారత్‌కే అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్:
* 40 విజయాలు: 68 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 40 విజయాలతో భారత్‌కు మోస్ట్ సక్సెస్ ఫుల్ టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
* 19 మ్యాచ్‌ల అన్ బీటెన్ రికార్డ్: ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు వరుసగా 19 టెస్టుల్లో ఓటమే లేకుండా సుదీర్ఘమైన విజయోత్సవ రికార్డు నెలకొల్పాడు.
* కెప్టెన్‌గా డబుల్ సెంచరీలు: టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు బాదాడు. వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్‌లలో డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్.
* ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 11 సెంచరీలు: 2017లో కెప్టెన్‌గా ఒకే ఏడాదిన అత్యధికంగా 11 అంతర్జాతీయ సెంచరీలు, 2,818 పరుగులు సాధించిన భారత రికార్డు సృష్టించాడు.
* ఒకే విదేశీ పర్యటనలో 9-0 క్లీన్ స్వీప్: 2017లో శ్రీలంక గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిసి లంకను 9-0తో క్లీన్ స్వీప్ చేసిన ఏకైక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.
* ఆల్-టైమ్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్: ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు) తర్వాత 28,601 పరుగులతో ఆల్‌టైమ్ అత్యధిక పరుగుల లిస్టులో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
