ధనత్రయోదశికి గోల్డ్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

ధనత్రయోదశికి గోల్డ్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!

ధనత్రయోదశి అంటేనే మన దేశంలో బంగారం కొనేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆభరణాలు ధరించడం, పండుగ వేళ బంగారం కొనుగోలు చేయడం మన సంస్కృతిలో భాగం. అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. కేవలం భావోద్వేగాలకే పరిమితం కాకుండా, ఖర్చులు, రిస్కులు, లిక్విడిటీ, ఆర్థిక లక్ష్యాలను బేరీజు వేసుకుని అడుగులు వేయడం చాలా ముఖ్యం.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ధనత్రయోదశికి గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారు ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే:

1. ఎందుకు కొంటున్నారో క్లారిటీ ముఖ్యం:
బంగారాన్ని ధరించడానికా, బహుమతిగా ఇవ్వడానికా లేదా దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నారా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి కొనేముందు. ఆభరణాలు, కాయిన్స్ పండుగ సంప్రదాయాలకు సరిపోతాయి. అదే సమయంలో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే 'గోల్డ్ ఈటీఎఫ్' వంటివి మంచి ప్రత్యామ్నాయం.

2. మేకింగ్ ఛార్జీలు, ఇతర ఖర్చుల బేరీజు:
నెక్లెస్సులు, ఉంగరాలు వంటి జ్యువెలరీ కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, తరుగు, జీఎస్టీ అదనంగా పడతాయి. ఇవి మొత్తం ఖర్చును మనం ఊహించినదాని కన్నా పెంచేస్తుంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డిజిటల్ గోల్డ్‌లో బై-సెల్ స్ప్రెడ్ ఛార్జీలు ఉంటాయని గమనించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఎక్స్‌పెన్స్ రేషియో, బ్రోకరేజ్ ఫీజులు ఉంటాయి. 

3. ప్యూరిటీ అండ్ స్టోరేజ్:
BIS హాల్మార్కింగ్, స్వచ్ఛత సర్టిఫికేట్, హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ ఉందా లేదా అని చూసి మాత్రమే ఆభరణాలు కొనుగోలు చేయాలి. ఇక డిజిటల్ గోల్డ్ ఎంచుకునేవారు ఆ ప్లాట్‌ఫారమ్ విశ్వసనీయత, సేఫ్టీ, స్వచ్ఛమైన రియల్ గోల్డ్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారనే విషయాలను పరిశీలించాలి. సెబీ రూల్స్ ప్రకారం నడిచే గోల్డ్ ఈటీఎఫ్‌లు మరింత సురక్షితమైనవి.

4. డిజిటల్ గోల్డ్‌లోని రిస్క్‌లు:
డీమ్యాట్ ఖాతా లేకుండానే ఆన్‌లైన్‌లో తక్కువ మొత్తంలో బంగారం కొనేందుకు డిజిటల్ గోల్డ్ వెసులుబాటు కల్పిస్తుంది. అయితే దీనికి సెబీ ప్రత్యేక నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ లేదు. కాబట్టి ప్రొవైడర్ క్రెడిబిలిటీ, రిడెంప్షన్ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవటం చాలా అవసరం.

►ALSO READ | ఒక్క రూపాయి ఎరగా పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.. కొత్త మోసంతో జాగ్రత్త!

5. పన్నులు లిక్విడిటీ:
ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు జ్యువెలర్స్ తమ బైబ్యాక్ పాలసీలను బట్టి కొంత కోత విధించవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లను స్టాక్ మార్కెట్ గంటల్లో ఎప్పుడైనా సులభంగా ట్రేడ్ చేయవచ్చు. జ్యువెలరీ, డిజిటల్ గోల్డ్‌పై జీఎస్టీ వర్తిస్తుంది. అలాగే పెట్టుబడి రూపం, హోల్డింగ్ పీరియడ్ ఆధారంగా క్యాపిటల్ గెయిల్స్ ట్యాక్స్ మారుతుంది. కేవలం ధరల పెరుగుదలే కాకుండా పన్నులు పోను వచ్చే నికర రాబడిని లెక్కగట్టాలి ఇన్వెస్టర్లు.

ప్రస్తుతం ధరల పెరుగుదల కారణంగా చాలా మంది తక్కువ స్వచ్ఛత గల ఆభరణాల వైపు, పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవటానికి మొగ్గు చూపుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. పండుగ ఉత్సాహంలో ధరల ట్రెండ్ చూసి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా.. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు తగినట్లుగా సరైన విధంగా గోల్డ్ ఆభరణాలు లేదా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం మంచిది.