AI రంగంలో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తూ బిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్.. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తన ఉద్యోగుల కోసం బైఔట్ అదేనండీ వాలంటరీగా ఉద్యోగ విరమణ స్కీమ్ అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల ఉద్యోగులకు ఈ ఆఫర్లను వర్తింపజేస్తూ కంపెనీ ఖర్చుల తగ్గింపు చర్యలను వేగవంతం చేసింది.
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగుల సంఖ్య గత కొన్ని త్రైమాసికాల్లో పెరిగినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వనరులను అత్యంత ప్రాధాన్యతా రంగాల వైపు మళ్లించాలని భావిస్తోంది. ఇంతకు ముందు 2025లో అమెరికా, బ్రిటన్‌లలోని కొన్ని డివిజన్ల ఉద్యోగులకు ఈ బైఔట్ ప్రక్రియను ప్రారంభించింది గూగుల్. కంపెనీ భవిష్యత్ వ్యూహాలకు ఇకపై సరిపోలలేమని భావించే ఉద్యోగులకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయమని అప్పట్లో ఎగ్జిక్యూటివ్‌లు స్పష్టం చేశారు.
అయితే ఈ బైఔట్ ఆఫర్ల నుంచి గూగుల్ క్లైడ్, అత్యంత కీలకమైన AI యూనిట్ 'డీప్‌మైండ్' ఉద్యోగులను పూర్తిగా మినహాయించారు. గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనా అష్కెనాజీ గతంలోనే క్లౌడ్ కంప్యూటింగ్, AI రంగాల్లో కొత్త రిక్రూట్మెంట్స్ తమ ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న గూగుల్ ఇంజనీరింగ్ హబ్ ఉద్యోగులకు కూడా ఈ ప్యాకేజీలను అందించగా.. అక్కడి నుంచి కొందరు ఉద్యోగులు సంస్థను వీడారు.
►ALSO READ | దీపావళి ముందు స్టాక్ మార్కెట్ దూకుడు : ట్రంప్ ఓడిపోవటంతో భారీ లాభాలు
ఈ స్వచ్ఛంద విరమణ కింద అంగీకరించి వెళ్లే ఉద్యోగులకు కంపెనీ మంచి పరిహారాన్ని అందిస్తోంది. ప్రతి ఏటా సర్వీసుకు ఒక నెల వేతనాన్ని చెల్లించేలా.. గరిష్టంగా 12 నెలల జీతం వరకు పరిహారంగా ఇస్తున్నారు. AI పై భారీ ఖర్చులు చేస్తున్న గూగుల్.. సంస్థలో వనరుల పునర్వ్యవస్థీకరణ ద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కొత్త టెక్నాలజీల అభివృద్ధిలో నైపుణ్యాలు ఉన్న ఏఐ ఇంజనీర్ల కోసం పాత ఉద్యోగులను త్యాగం చేయాల్సిన పరిస్థితి టెక్ రంగంలో పెరిగిపోతోంది రోజురోజుకూ.
