- రూ.1.91 లక్షల కోట్లకు చేరిన ఏయూఎం
- పండగ వేళ పెరిగిన రిటైల్ రేట్లు ధరలు
- రూ.4,800 పెరిగిన బంగారం
న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఇన్వెస్టర్లు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) కోసం ఎగబడుతున్నారు. గత ఆరు నెలల్లో పసిడి ధరలు సుమారు 12 శాతం వరకు తగ్గాయి. ధరలు మళ్లీ పుంజుకుంటాయనే అంచనాలతో ఈటీఎఫ్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఫలితంగా గోల్డ్ ఈటీఎఫ్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఏప్రిల్ నెలలోని రూ.1.58 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ నాటికి ఏకంగా రూ.1.91 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మే 29వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,900 ఉండగా అక్టోబర్ 31 నాటికి రూ.20,900 మేర తగ్గి రూ.1.42 లక్షల స్థాయికి పడిపోయింది. అయితే బుధవారం రూ.4,800 పెరిగి రూ.1.46 లక్షలకు ఎగబాకింది.
తరుగు, కోతల బెడద లేదు..
భౌతిక బంగారం కొనుగోళ్లలో తయారీ ఖర్చులు, తరుగు, బ్యాంకు లాకర్ల చార్జీల వంటివి ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. వీటిని డీమ్యాట్ ఖాతా ద్వారా సులభంగా కొనొచ్చు కాబట్టి డిమాండ్ పెరుగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు.. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయ్యే ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు. వీటిలో ఒక యూనిట్ దాదాపు 99.5 శాతం స్వచ్ఛమైన భౌతిక బంగారంతో సమానం.
షేర్ల లాగానే మార్కెట్ వేళల్లో వీటిని నేరుగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ప్లాట్‌ఫారమ్‌లపై ఎప్పటికప్పుడు మారుతున్న ధరలకు కొనుగోలు చేయవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) విధానం ద్వారా చిన్న మొత్తాల్లో కూడా పసిడిలో పెట్టుబడి పెట్టే అవకాశం వీటిలో ఉంటుంది. వీటికి కూడా బ్రోకరేజ్, డీమ్యాట్, ఎక్స్పెన్స్ రేషియో వంటి చార్జీలు ఉంటాయి.
30 శాతం వరకు రాబడులు
ఈటీఎఫ్‌లు గత 12 నెలల్లో ఈ ఫండ్లు మదుపరులకు 30 శాతానికి పైగా లాభాలు అందించాయి. నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ గోల్డ్ ఈటీఎఫ్‌లు అత్యధికంగా 30.7 శాతం వరకు రాబడులు పంచాయి. ఇన్వెస్కో గోల్డ్ ఈటీఎఫ్ 30.6 శాతం లాభం సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు నిరంతరంగా బంగారం కొంటుండటం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కొనుగోలుదారులు ఈటీఎఫ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. పండుగల సీజన్‌లో కూడా వీటి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం రాబోయే ఏడాదిలోనూ బంగారానికి డిమాండ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
