ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. 2026, నవంబర్ 5వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అయ్యింది. గ్రామాల్లో ఓట్ల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే రాయలసీమ ఏరియాలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్ బూతుల దగ్గర హంగామా నడుస్తుంది. ఆయా పార్టీలు.. వారి వారి గ్రామాల్లో.. బలం ఉన్న చోట బల ప్రదర్శనకు దిగుతుంది.
ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా ఓటేరు గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. ఓటేరు గ్రామంలోని పోలింగ్ బూతుల దగ్గర 500 మంది కాలేజీ స్టూడెంట్స్ ఉండటాన్ని వైసీపీ పార్టీ నేతలు గుర్తించారు. పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లు కాని వాళ్లు ఎలా ఉంటారంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లు అయితే గుర్తింపు కార్డు ఉండాలి కదా.. పోలింగ్ బూత్ ఓటరు స్లిప్ ఉండాలి కదా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే టీడీపీ నేతలు దూసుకొచ్చారు. వాళ్లు గ్రామస్తులు అని.. పోలింగ్ బూతుకు దూరంగా ఉన్నారని.. అలాంటి వాళ్ల విషయంలో అభ్యంతరం ఏంటంటూ ఎదురుదాడికి దిగింది. ఓటర్లు కాని వ్యక్తులు.. పోలింగ్ బూతుల దగ్గర ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. వైసీపీ ఆందోళనకు దిగింది. దొంగ ఓట్లు వేయించేందుకు కాలేజీ స్టూడెంట్స్ దించారంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓటర్లు కానీ కాలేజీ స్టూడెంట్స్ ను గ్రామాల్లోకి ఎలా రానిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
