తెలంగాణలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది ఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు!

తెలంగాణలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది ఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు!

తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC)లో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్ విద్యార్థులను వేధించిన ఆరోపణలపై 14 మంది సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కాలేజీ వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాలేజీ క్యాంపస్‌లో సీనియర్ విద్యార్థులు తమను వేధిస్తున్నారని పేర్కొంటూ బాధితులు సుమారు వారం రోజుల క్రితం ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌ఎంసీ.. వెంటనే స్థానిక పోలీసులు మరియు కాలేజీ అధికారులను అప్రమత్తం చేసింది.

రంగంలోకి యాంటీ ర్యాగింగ్ కమిటీ

ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు కాలేజీ యంత్రాంగం అంతర్గత విచారణ షురూ చేసింది. కాలేజీలోని యాంటీ ర్యాగింగ్ మెకానిజం ద్వారా చేపట్టిన ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు కాలేజీలోని వీడియో ఫుటేజీలను, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో 14 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.

నలుగురు విద్యార్థులపై ఆరు నెలల సస్పెన్షన్

ఆరోపణల తీవ్రతను బట్టి విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌లో కీలక పాత్ర పోషించి, తీవ్రమైన వేధింపులకు పాల్పడినట్లు తేలిన నలుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. మిగిలిన పది మంది విద్యార్థులపై నాలుగు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. 

ఈ వ్యవహారంపై చర్చించేందుకు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి. వాల్యా నేతృత్వంలో మంగళవారం ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో (HODs) ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే దోషులుగా తేలిన విద్యార్థులపై తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేశారు.

కఠిన చర్యలు తప్పవు:

ప్రిన్సిపల్ యాంటీ ర్యాగింగ్ నిబంధనల ప్రకారమే ఈ చర్యలు ప్రారంభించామని ప్రిన్సిపల్ డాక్టర్ బి. వాల్యా స్పష్టం చేశారు. ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ర్యాగింగ్ నేరం రుజువైతే అకడమిక్ యాక్టివిటీస్ నుంచి సస్పెండ్ చేయడం, హాస్టల్ నుంచి బహిష్కరించడం, అవసరమైతే అడ్మిషన్ రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఈ ఘటనతో వైద్య విద్యార్థుల్లో ర్యాగింగ్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే భవిష్యత్తు దెబ్బతింటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.