1,000 గవర్నమెంట్ స్కూళ్లను అప్‎గ్రేడ్ చేయండి: కార్పొరేట్ కంపెనీలకు సీఎం డీకే సూచన

1,000 గవర్నమెంట్ స్కూళ్లను అప్‎గ్రేడ్ చేయండి: కార్పొరేట్ కంపెనీలకు సీఎం డీకే సూచన

బెంగళూర్: కర్నాటకలోని కార్పొరేట్ కంపెనీలకు ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ కీలక పిలుపునిచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలోని 1,000 గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలను డెవలప్ చేసేందుకు సహకరించాలని కోరారు. గురువారం (నవంబర్ 5) అసెంబ్లీ హాల్‌లో జరిగిన నా పాఠశాల, నా బాధ్యత కార్యక్రమంలో శివకుమార్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గ్రామాల్లోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందాలని, ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యం ఉండాలని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని కార్పొరేట్ కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రాబోయే మూడేళ్లలో సీఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ పాఠశాలలను అప్‎గ్రేడ్ చేసేందుకు సహకరించాలని కోరారు. 

ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ విరాళాలను విద్యాభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు మళ్లించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నాణ్యమైన విద్య అందించడం ద్వారా పట్టణ కేంద్రాలకు వలసలను కూడా పరిష్కరించవచ్చని అన్నారు. సామాన్య తల్లిదండ్రులు తమ పిల్లల మంచి విద్యనే వారి నిజమైన ఆస్తిగా భావిస్తారని పేర్కొన్నారు. ముంబై, ఢిల్లీ, గుజరాత్‌లలో నమోదైన కొన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ కేటాయింపులను ఆయా ప్రాంతాలకు మళ్లిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

కార్పొరేట్ సంస్థలు తమ విరాళాలను బెంగళూరుకే పరిమితం చేయకుండా జిల్లాల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు కూడా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాఠశాలల నిర్మాణం, ఉపాధ్యాయుల జీతాలు, తాగునీటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాల నిర్వహణకు కంపెనీలు మద్దతు ఇవ్వగలవని అన్నారు. కర్ణాటకలో పనిచేస్తున్న లాభదాయక వ్యాపారాలు గ్రామీణ పిల్లల విద్యావకాశాలను మెరుగుపరచడానికి దోహదపడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.