స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అక్రమాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం (నవంబర్ 5) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రక్రియపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, అయితే చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కును హైజాక్ చేసి ఎన్నికలు నిర్వహించిందని విమర్శించారు. శకుని మాయాపాచికల్లా ఎన్నికల ప్రక్రియను రిగ్ చేశారని, అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ఎన్నికల వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకున్నారని ఆరోపించారు.
హామీలపై సమాధానం చెప్పలేకే ఎన్నికల అక్రమాలు
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, 143 హామీలపై ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని జగన్ ఆరోపించారు. ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చి, 2024 జూన్ నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, వాటిని అమలు చేయలేక ప్రజలను ఎదుర్కొనే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు.
వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించారని, అరెస్టులు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలతో పోలీసులు కుమ్మక్కై తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. స్క్రూటినీ పేరుతో పత్రాలు మాయం చేయడం, సంతకాలు ఫోర్జరీ చేయడం, నామినేషన్లను తిరస్కరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
నామినేషన్ల దశ నుంచే పోటీకి అడ్డంకులు
17 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదని, మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారని జగన్ ఆరోపించారు. పులివెందులలో 40 వార్డులకు గాను 20 వార్డుల్లో మాత్రమే తమ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని పేర్కొన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహా దౌర్జన్యం కొనసాగిందని, 84 జెడ్పీటీసీ, 2,109 ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారని ఆరోపించారు. అభ్యర్థులను అరెస్టు చేయడం, పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటులోనూ లోపాలు
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నామినేషన్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని జగన్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో 11,378 పోలింగ్ కేంద్రాలకు గాను 5,737 కేంద్రాల్లో మాత్రమే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 31,460 కేంద్రాలకు గాను 16,064 కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
నామినేషన్ల నుంచి ఫలితాల వరకు ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నామినేషన్లు, స్క్రూటినీ, పోలింగ్ బూత్‌లు, పోలింగ్ శాతం, రాత్రిపూట బ్యాలెట్ బాక్సుల నిర్వహణ వరకు అన్ని దశల్లోనూ రిగ్గింగ్ జరిగిందని విమర్శించారు.
ఎన్నికల వ్యవస్థ అధికార పార్టీ గుప్పిట్లోకి వెళ్లింది
పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకుండా సహకరించారని జగన్ ఆరోపించారు. విశాఖలో తమ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాతే స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారని పేర్కొన్నారు. అక్రమాల మధ్య ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిస్తే, ఆ ఫలితాలను కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
చంద్రబాబు, ఆయనకు సంబంధించిన అధికారులు, పోలీసులు, రిటర్నింగ్ అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల వ్యవస్థను అధికార పార్టీ గుప్పిట్లోకి తీసుకున్నారని జగన్ విమర్శించారు. ఇవి నిజమైన ఎన్నికలా..? లేక ముందే నిర్ణయించిన ఎంపికలా..? అన్నది ప్రజలు ఆలోచించాలని అన్నారు.
