- ఫిన్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు..
- ఫైటర్ జెట్ రక్షణలో రోమ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- డబ్లిన్ నుంచి రోమ్‌కు వెళ్తున్న ఏయిర్ లింగస్ విమానానికి కూడా బాంబు థ్రెట్
- మిలాన్ నుంచి వార్సా వెళ్తున్న విజ్ ఎయిర్ (Wizz Air) విమానానికి బెదిరింపులు
బాంబు బెదిరింపులతో యూరప్ అంతటా పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. గురువారం ఉదయం హెల్సింకి నుంచి ఇటలీ రాజధాని రోమ్‌కు వెళ్తున్న ఫిన్ ఎయిర్ ప్యాసింజర్ విమానానికి రక్షణగా ఇటాలియన్ ఫైటర్ జెట్‌లను పంపించి రోమ్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
హెల్సింకి (ఫిన్లాండ్) నుంచి రోమ్‌కు వస్తున్న ఫిన్‌ఎయిర్ విమానంలో బాంబు ఉన్నట్లు అగంతుడినుంచి మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన ఇటలీ వైమానిక దళం ఫైటర్ జెట్‌లను రంగంలోకి దించి ఆ విమానానికి రక్షణగా తీసుకెళ్లి రోమ్‌లోని ఫియుమిసినో ఎయిర్ పోర్టులో సురక్షితంగా దించాయి. అనంతరం బాంబు స్క్వాడ్ నిపుణులు విమానాన్ని తనిఖీ చేశారు.
ఫ్రాన్స్‌కు మళ్లించిన మరో విమానం..
ఇదే సమయంలో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నుంచి రోమ్‌కు బయలుదేరిన ఏయిర్ లింగస్ (Aer Lingus) విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఎవరెక్స్ మిలిటరీ ఎయిర్‌బేస్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానానికి ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్ రక్షణగా పంపించారు.
వీటితోపాటు మిలాన్ నుంచి వార్సా వెళ్తున్న విజ్ ఎయిర్ (Wizz Air) విమానాన్ని వియన్నాకు మళ్లించారు. బల్గేరియా, బెల్జియం దేశాల్లోని మరికొన్ని విమానాలకు కూడా ఇటువంటి హెచ్చరికలు వచ్చాయి.
యూరప్ అంతటా గత కొన్ని రోజులుగా ప్యాసింజర్ విమానాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా వస్తుండగా..ఈ బాంబు బెదిరింపులన్నీ నకిలీవని విమానాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారం ఫైటర్ జెట్ రక్షణ,తనిఖీలు చేపట్టారు.
