ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఇతనేనా.. !

ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఇతనేనా.. !

అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. అతనే డెమోక్రటిక్ పార్టీ తరఫున జార్జియా సెనేటర్‌గా ఘనవిజయం సాధించిన జాన్ ఒసాఫ్. ట్రంప్ తర్వాత అమెరికా తర్వాతి అధ్యక్షుడిగా జాన్ ఒసాఫ్ అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. రిపబ్లికన్ అధినేత డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన రాష్ట్రంలోనే.. అత్యంత వ్యూహాత్మకంగా తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఒసాఫ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రంప్ హవాను ఎదుర్కొని సాధించిన ఈ సంచలన విజయంతో.. ఒసాఫ్ డెమోక్రటిక్ పార్టీలో అత్యంత శక్తివంతమైన యువ నాయకుడిగా మారారు.

39 ఏళ్ల వయసున్న జాన్ ఒసాఫ్ పాలిటిక్స్ చేసే స్టైల్, మాట్లాడే తీరు అచ్చం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను తలపిస్తున్నాయి. ప్రసంగాల్లో ఆయన వాగ్ధాటి, ప్రజలను ఆకట్టుకునే నైపుణ్యం చూస్తుండటంతో రాజకీయ విశ్లేషకులు ఆయన్ను 'నెక్స్ట్ ఒబామా'గా అభివర్ణిస్తున్నారు. 2028లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున వైట్‌హౌస్ రేసులో ప్రధాన అభ్యర్థిగా నిలుస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ విధానాలను, పరిపాలనను ఒసాఫ్ అత్యంత తీవ్రంగా విమర్శిస్తున్నారు. ట్రంప్ వర్గాన్ని బహిరంగంగానే ప్రశ్నిస్తూ.. అవినీతిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రత్యర్థులను మాటలతో నిలదీయడంలో, రిపబ్లికన్ల వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆయన చూపుతున్న సంయమనం.. దూకుడు అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ వైట్ హౌస్ వర్గాలు కూడా ఆయన శైలిని ఎద్దేవా చేశాయంటే, అక్కడి రాజకీయలపై అతని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జార్జియాలో జరిగిన ఎన్నికల్లో ఒసాఫ్ ఎదుర్కొన్న సవాళ్లు అంతా ఇంతా కాదు. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యాన్ని నిలపడంలో అతని గెలుపు కీలక పాత్ర పోషించింది. డాక్టర్ అయిన అలిషా క్రామర్‌ను వివాహం చేసుకున్న ఒసాఫ్.. జర్నలిజం రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఊహించని గ్రోత్ చూశారు. దివంగత పౌర హక్కుల నేత జాన్ లూయిస్ అడుగుజాడల్లో నడిచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆయన.. నేడు అమెరికా రాజకీయ దిగ్గజాలకు బలమైన పోటీదారుగా మారారు.

ట్రంప్ తర్వాతి అమెరికా రాజకీయ శకంలో డెమోక్రటిక్ పార్టీకి ప్రధాన సారథి ఎవారనే ప్రశ్నకు జాన్ ఒసాఫ్ రూపంలో సమాధానం దొరుకుతోంది. ఆయన అనుసరిస్తున్న విధానాలు, యువతను ఆకట్టుకునే లక్షణాలు ఆయన్ను నేరుగా అధ్యక్ష పీఠం వైపు నడిపిస్తున్నాయి. భవిష్యత్తులో అమెరికాను పాలించే సత్తా ఉన్న నాయకుడిగా ఎదుగుతున్న ఒసాఫ్.. నిజంగానే ట్రంప్ తర్వాత వైట్‌హౌస్‌లో అడుగుపెడతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.